కార్తీక శుద్ద ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈరోజు ద్వాదశి తిథి. ఈరోజున ఉసిరికొమ్మను విష్ణువుగా, తులసి దేవిని లక్ష్మీదేవిగా భావించి వాటికి వివాహం జరుపుతారు. ఈ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి, బృందావన ద్వాదశి, ఉత్థాన ద్వాదశి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. మరి వాటి పేర్ల వెనుక ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకుందాం.


ఆషాడ శుద్ద ఏకాదవి రోజున పాలకడలిలో యోగనిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడు. దాన్ని ఉత్థాన ఏకాదశిగా పిలుస్తాం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీమహావిష్ణువు, ద్వాదశి రోజున లక్ష్మీదేవిని వివాహమాడతాడు. అందుకే ఏకాదశి తర్వాత రోజున వచ్చే ద్వాదశి తిథిని ఉత్థాన ద్వాదశి అని పిలుస్తాం.


క్షీరసాగర మథన ఘట్టం గురించి వివరణ అనేక పురాణాల్లో ప్రస్తావనలో ఉంది. వాసుకుని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ చేసుకుని ఈరోజునే రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని పిలుస్తుంటారు. అలాకే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తుంటారు. అదేవిధంగా పాలకడలి నుంచి వచ్చిన శ్రీమహా లక్ష్మి ఈరోజు శ్రీ మహా విష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే క్షీరాబ్ది కన్యక అని ఆమెను పిలుస్తుంటాం. అందుకు గుర్తుగా కూడా ఈరోజును క్షీరాబ్ది ద్వాదశి అని చెబుతాం.


ఆషాఢ శుద్ద ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ద ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్షను చేస్తారు. ఈరోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగీశ్వర ద్వాదశిగా కూడా పిలుస్తుంటారు.


ఈరోజును బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు. మహాలక్ష్మీ సమేతుడై శ్రీమహావిష్ణువు బృందావనానికి వస్తాడు. బృందావనం అంటే తులసీ వనం అని అర్థం. అందుకే ఈరోజు తులసీ చెట్టుకు అంతటి ప్రాధాన్యత వచ్చింది.


ఈరోజున పుణ్యనదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో కాశీ క్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది. ఈ కార్తీకమాసంలో శనిత్రయోదశి సోమవారం కన్నా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. ఆ శని త్రయోదశికన్నా కార్తీక పూర్ణమి వందరెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఆ కార్తీక పూర్ణమి కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందనేది ఆర్యోక్తి. బహుళ ఏకాదశి కన్నా కార్తీక ద్వాదశి ఎక్కువ ఫలాన్ని ఇస్తుందని భాగవత మహాపురాణంలో చెప్పబడింది.


ఈ కారణం చేతనే ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు ఇంటిని రకరకాల దీపమాలికలతో అలంకరించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. ధాత్రీ, తులసీ చెట్లకు వివాహాన్ని జరుపుతారు. ఇక కొన్నిచోట్ల ఈ ద్వాదశి రోజున ఉదయాన్నే తులసీ మొక్క దగ్గర, ఒక పెద్ద పాత్రలో ఆవుపాలు పోసి, అందులో బియ్యం పిండిని వేసి జొన్నకర్రతో చిలుకుతారు. చిలికేటప్పుడు ఆ క్షీరసాగర మథనానికి గుర్తుగా ఉండే పాటను పాడుతుంటారు. అంటే క్షీరసాగర మథనానికి గుర్తుగా ఈ పనిచేస్తారు. ఆ తర్వాత ముత్తయిదువలను పిలిచి మంగళద్రవ్యాలను అందిస్తారు. ఇలా కొన్ని చోట్ల విశేషంగా చిలుకు ద్వాదశిని చేసుకుంటారు.


Also Read: క్షీరాబ్ది ద్వాదశి కథ: ఇది విన్నా, చదివినా చాలు సకల పాపాలు తొలగిపోతాయ్!