Security In AP :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మరీ దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష నేతలెవరూ స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకపోవడం.. ఒక వేళ ఎక్కడికి వెళ్లినా వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉద్రిక్తలు సృష్టిస్తూండటంతో  ఆ పర్యటనలన్నీ వివాదాస్పదమవుతున్నాయి. పోలీసుల తీరును ప్రశ్నించేలా చేస్తున్నాయి. మరో వైపు అందరూ ప్రభుత్వంపై వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను భయపెట్టేలా చేయడానికి ఇలా చేస్తున్నారా ?  వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ వల్ల ఇలా జరుగుతోందా ? లేక ఏమీ జరగకపోయినా... విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయా ?


పవన్ పర్యటనల్లో వరుసగా ఉద్రిక్తతలు -  హైదరాబాద్‌లో పవన్ పై రెక్కీ వివాదం!


జనసేన అధినేత పవన్ కల్యాణ్ విసఆఖ ఫర్యటనకు వెళ్లారు. ఆయన గతంలో చాలా సార్లు వెళ్లారు. కానీ ఎప్పుడూ లేనిది మొన్నటి పర్యటనలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పవన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరక ముందే.. ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన జనసైనికులతో మంత్రి రోజా రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో పరిస్థితి అదుపు తప్పింది. రోజా తీరుపై తీవ్ర విమర్శలొచ్చినా..మొత్తం కట్టడి మాత్రం పవన్ కల్యాణ్‌పైనే చూపించారు పోలీసులు. పవన్ వస్తే అభిమానులు ర్యాలీ నిర్వహించడం సహజం. అది ప్లాన్డ్ ఏమీ కాదు. జనసైనికుల్ని అదుపు చేయలేరు. కానీ అదే కారణం చూపించి... పవన్ కల్యాణ్‌ను నిర్బంధించి.. విశాఖ నుంచి విజయవాడకు తరలించేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఆయన ఇంటి దగ్గర కొంత మంది గొడవపడటం... పవన్‌ను కొంత మంది యువకులు అనుసరిస్తున్నారని గుర్తించడం వివాదాస్పదమయింది. ఆయన భద్రతపై జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కు కేంద్ర భద్రత  కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ నేతలూ అదే చెబుతున్నారు. 


చంద్రబాబు ప్రతీ పర్యటనలోనూ ఉద్రిక్తతలే !


ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎక్కడికి వెళ్లినా ఉద్రిక్తతలు చోటుచేసుకుటున్నాయి. నందిగామ పర్యటనలో చంద్రబాబు లక్ష్యంగా విసిరిన రాయి.. సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలింది. అదే చంద్రబాబుకు తగిలి ఉంటే..? .  కొద్ది రోజుల కిందట సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడా రాళ్ల దాడులు జరిగాయి.   ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆ ఘటన తర్వాత చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది.  జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం..  కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్న సమయంలోనే   చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు జారీ చేసింది.  అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టిడిపి కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు.. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్రం భద్రత పెంచినా... ఆయన పర్యటనలో తరచూ వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘర్షణకు దిగుతూనే ఉన్నారు. 


ప్రజాసమస్యలపై పోరాటాలకు విపక్షాలు వెళ్తే దాడులు చేస్తారనే భయం !


ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వి ప్రభుత్వం పై పోరాడి ప్రజల మెప్పును సంపాదించి అధికారం పొందాలనుకుంటాయి. అది వారి రాజ్యాంగ విధి.  అయితే అధికార పార్టీ వారిని నియంత్రించాలనుకోవడం  అదీ కూడా పోలీసు వ్యవస్థను ఉపయోగించి మరీ .. బలవంతంగా వారి వారి రాజకీయ కార్యక్రమాలు చేసుకోనివ్వకుండా చేయడం మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్య ఉల్లంఘనేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రుషికొండ ఏమైనా నిషేధిత ప్రాంతమా..? అక్కడికి వెళ్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న విధ్వంసం ప్రజల ముందు ఉంచుతామనే అడ్డుకుంటున్నారని వారంటున్నారు. 


పోలీసుల తీరు ఏకపక్షం ఉంటోందని విమర్శలు !


పోలీసులు భద్రత కల్పించాలి. కానీ .. ఘర్షణలు జరిగేలా చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల పాదయాత్ర జరుగుతున్న సమయంలో వారికి పోటీగా గర్జనలు నిర్వహించేలా సహకరించారు. దాడులకు పాల్పడినా నియంత్రించలేదు. రాజమండ్రిలో స్వయంగా ఎంపీ చేసిన పని వైరల్ వీడియోగా ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతుంది. అదే పరిస్థితి అన్ని చోట్లా ఉంటోంది. విపక్ష నేతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. కానీ అ బాధ్యతలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


మొత్తంలో ఏపీలో ప్రతిపక్ష నేతలకు భద్రత కొరవడిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గడానికి కారణం అవుతుంది.