Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెజ్జంకి మండల కేంద్రం. హైదరాబాద్ కు వెళ్లే మార్గంలో హైవే నుండి లోపలికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. ఆకట్టుకునే రంగురంగుల కమాన్ మనకు స్వాగతం పలుకుతూ ఉండగా.. లోపలికి వెళ్ళగానే ఒక రైతు కుటుంబంతో కూడిన భారీ విగ్రహం మనల్ని ఆకర్షిస్తుంది. పాడి పంటలకు ప్రసిద్ధి చెందిన బెజ్జంకి మండల కేంద్రంలోని పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధి గాంచింది. తెలంగాణలో జరిగే పెద్ద జాతరలలో ఇక్కడ కూడా జరిగే జాతర ఒకటి. చైత్ర మాసంలో జరిగే ఈ జాతరకు చుట్టుపక్కల ఊర్ల నుండి మాత్రమే కాదు. దాదాపుగా స్వామిని ఇలవేల్పుగా కొలిచే కొన్ని వేల కుటుంబాల వారు వచ్చి హాజరవుతారు.


భారీ ఎత్తున ఉన్న కొండ లాంటి రాయి చుట్టూ జరిగే రథోత్సవం కనువిందుగా ఉంటుంది. ఇక ఆలయం ప్రారంభం లోనే భారీ ఏనుగు బొమ్మ పిల్లలను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక్కడి నుండి ఆలయం వద్దకి వెళ్లడానికి మెట్లతో కూడిన మార్గం ఉంది. గుట్ట పైకి వెళ్ళగానే ఎడమ వైపున ఉంటుంది పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణానికి రామప్పకి చెందిన సుప్రసిద్ధ కాకతీయ శిల్పాచార్యులే వాస్తు, శిల్పకళను అందించారని ప్రతీతి. అందుకే భారీ స్తంభాలతో కూడిన ఆలయం ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉంది. ఇక్కడి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంపై గోపిక నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మథన కథ మొదలైన వాటిని అద్భుతంగా చెక్కారు.


ఇక పూర్తిగా గుట్ట పైకి వచ్చినట్లయితే అక్కడ చిన్నపాటి శివాలయం ఉంది. ఒకే ఒక రాయి ఒక కొండలా ఏర్పడి ఉండడంతో దీని రూపు చూడడానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడిని పోలి ఉంటుంది. పై నుండి చుట్టుపక్కల గ్రామాలన్నీ కనువిందుగా  పచ్చదనంతో కట్టిపడేస్తాయి.




ఇక శివాలయానికి ఎడమ వైపున ఉన్న ఏకశిలా స్తంభం వద్ద భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. రవాణా ఇతర సౌకర్యాలు పుష్కలంగా ఉన్నా.. మరింత శ్రద్ధ పెట్టి పర్యాటక ప్రదేశంగా మార్చితే బాగుంటుందని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. గతంతో పోలిస్తే అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడ జరిగే జాతర పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రచారం చేసినట్లయితే మరింత బాగుంటుందని వారు అంటున్నారు.