Jagannath Rath Yatra 2023 : సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువైన క్షేత్రం పూరీ.  ఈ ఏడాది జూన్ 20 న జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవుతుంది. 
అయోధ్యా మధురా మాయా 
కాశీ కాంచీ అవంతికా
పూరీ ద్వారావతీచైవ
సప్తైతే మోక్షదాయకా!!


పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం.  ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని  చెబుతారు. 


Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాల్, గర్భగుడి నుంచి జనం మధ్యకు జగన్నాథుడు!


పూరీ విగ్రహాల వెనుక చాలా పెద్ద కథ ఉంది


అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉండిరపోయిన  జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు.  విశ్వావసుడి కూతురైన లలితను..విద్యాపతి ప్రేమ వివాహం చేసుకుంటాడు.  జగన్నాథుడి విగ్రహాన్ని చూపించాలని మావగారైన విశ్వావసుడిని పదేపదే అడుగుతాడు విద్యాపతి. అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ గిరిజనరాజు కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. తెలివిగా వ్యవహరించిన విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. ఈ మేరకు  రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశ చెంది అశ్వమేథయాగం చేస్తాడు. ఓ రోజు మహారాజు కలలో కనిపించిన జగన్నాథుడు సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప దుంగలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. 


దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!


సగంమాత్రమే చెక్కి ఉంటాయెందుకు


కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో రాచమందిరానికి చేరుకుంటాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. అందుకు అంగీకరించిన రాజు అటుగా ఎవ్వరూ వెళ్లకూడదని భటులను ఆదేశిస్తారు. రోజులు గడుస్తున్నా విశ్వకర్మ గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. లోపల శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని చెప్పి స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.