ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం
అప్పట్లో వకుళవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో వకుళారణ్యం అని పిలిచేవారట. చుట్టుపక్కల ప్రాంతాల సాగుకి నీరందించే ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కట్టకు దిగువగా ఉంది శ్రీరామచంద్రుడి ఆలయం. ప్రతి ఆలయంలో రామయ్య పాదాల దగ్గరే ఉండే ఆంజనేయుడు ఇక్కడ కనిపించడు. 


ప్రచారంలో ఉన్న కథనం
రావణసంహారం అనంతరం సీతాదేవితో కలసి అయోధ్యకు తిరిగి వెళుతున్న సమయంలో శ్రీరాముడు వకుళవనం దగ్గర ఆగాడట. ఆ సమయంలో రాముడు అయోధ్యకు వస్తోన్న విషయాన్ని భరతుడికి చేరవేసేందుకు వెళ్లాడట ఆంజనేయుడు. ఆయన తిరిగి వచ్చాక పుష్కరిణిలో స్నానమాచరించి అక్కడి నుంచి సీతారాములను దర్శించుకుని నమస్కరించాడు. అందుకే హనుమంతుడి విగ్రహం ఆలయంలో కాకుండా పుష్కరిణి ఒడ్డున ఉంటుంది.


పెరియ పెరియ పెరియ స్వామి
పెరియ అంటే వరుస.ఈ ఆలయంలో మూడు వరసల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మొదటి వరుసలో ఉన్నవి  శ్రీమన్నారాయణుడు ప్రసాదించినవి, రెండో వరుసలో ఉన్నవి శ్రీ రామానుజాచార్యులు పూజించినవి, మూడో వరుసలో ఉన్నవి ప్రతిష్టించిన విగ్రహాలు..అందుకే ఇక్కడ స్వామివారిని పెరియ పెరియ పెరియ స్వామి అంటారు. కృతయుగంలో బ్రహ్మ పుత్రులు శ్రీమన్నారాయణుడిని తమకు మోక్షం ప్రసాదించమని కోరారు. అప్పుడు స్వామి తన విగ్రహాన్నిచ్చి, వకుళారణ్యంలో విభాండక మహర్షి ఆశ్రమంలో ఉంచి  మోక్షంకోసం తపస్సు చేయమని చెప్పాడట. ఆ ప్రదేశమే ప్రస్తుతం కోదండ రాముడు నెలకొన్న మధురాంతకం. శ్రీమన్నారాయణునితో బ్రహ్మపుత్రులకు ఇచ్చిన విగ్రహాలే అక్కడ మొదటి వరుసలో ఉన్నవి అని చెబుతారు.  


Also Read: భోజనం బాలేదు అంటూ తిట్టుకుంటూ తింటున్నారా!


వైష్ణవ మత ప్రబోధకుడు శ్రీ రామానుజాచార్యులు పెరంబదూరులో జన్మించినా, ఆయన ఆధ్యాత్మిక రంగంలో అడుగిడినదిక్కడే.  ఆయన పెరియనంబి దగ్గర దీక్ష తీసుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీరంగం వెళ్తూ దారిలోనే ఆయన్ని కలిశారు. అప్పుడు పెరియనంబి వకుళవనంలోనే పంచ సంస్కారాలను ప్రబోధించారని చెబుతారు. 1937 లో కలకత్తాకు చెందిన సేఠ్ మగన్ లాల్ ఆలయాన్ని పునరుధ్ధరిస్తుండగా ఆలయం బయట గోడదగ్గర భూమిలోవున్న ఒక గుహని చూశారు.తవ్వి చూడగా 20 అడుగుల లోపల ఒక మండపంలో నవనీత కృష్ణుడి చిన్న రాగి విగ్రహం, శంఖం, చక్రం బయటపడ్డాయి.  పెరియనంబి రామానుజులవారికి దీక్ష ఇవ్వటానికి వీటిని వాడారని భావించారు. 


అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన ఆంగ్లేయుడు 
150 సంవత్సరాల క్రితం అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో వున్న ఈ ప్రాంతానికి  లియనాల్డ్ ప్లేస్ అనే ఆంగ్లేయుడు కలెక్టరుగా వున్నాడు. ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్మేవాడు. మధురాంతకం ఆలయానికి ఎగువన నీరును నిల్వచేసేందుకు ఓ పెద్ద చెరువు ఉండేది. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఆ నీరు పొంగి సాగుని, చుట్టుపక్కల గ్రామాలను ముంచేసేది. ఏటా లియనార్ ప్లేస్ ఓ గట్టు కట్టించినా మళ్లీ వర్షాలకు అది కొట్టుకుపోయేది. ఓ సందర్భంలో మధురాంతకం ఆలయంలో బ్రాహ్మణులంతా ఆయన్ను కలసి అమ్మవారికి మరో ఆలయం నిర్మించాలనుకున్నామని డబ్బు సహాయం చేయమని కోరారు. ఏటా వరదల నుంచి మిమ్మల్ని కాపాడని దేవుడికి ఆలయం ఎందుకన్న ఆ ఆంగ్లేయ కలెక్టర్..ఈ ఏడాది కట్టించిన కట్ట నిలబడతే ఆలయ నిర్మాణానికి ధనసహాయం చేస్తానన్నాడు. అలా ఆ ఏడాది భారీగా వానలు పడినప్పటికీ ఆ కట్ట తెగలేదట. ఆ దృశ్యం చూసిన కెలక్టర్ తన వాగ్ధానం ప్రకారం అమ్మవారికి ఆలయం నిర్మించాడని కథనం. 


ఈ ఆలయంలో శ్రీ రామనవమికి 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా జూన్, జూలైలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 


Also Read:  ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!


Also Read: దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే స్థలం, శివయ్య ధ్యానం చేసిన మహిమాన్విత ప్రదేశం