కొత్త సంవత్సరం వస్తోందంటే అందరిలో కొత్త ఉత్సాహం కూడా మొదలవుతుంది. కొత్త ఆశలు, ప్రణాళికలతో సిద్ధం అవుతుంటారు అందరూ. కొత్తగా ఇంటి నిర్మాణం చెయ్యాలనుకునే వారు ఈ వాస్తు నియమాలను పాటిస్తే 2023 సంవత్సరంలో జీవితం సుఖసంతోషాలతో ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.


ప్లాట్ వాస్తు 



  • నిర్మాణానికి ఉపయోగించే భూమి చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. దీర్ఘ చతురస్ర ప్లాట్ అయితే ఉత్తర దక్షిణాలు పొడవుగా, తూర్పూ పడమరలు పొట్టిగా ఉండేలా చూసుకోవాలి.

  • ప్లాట్ సరిహద్దు భాగాలకంటే మధ్య భాగం, లేదా నైరుతి భాగం ఎత్తుగా, బరువుగా ఉండాలి. ఈశాన్యం వైపు వాలుగా ఉంటే అది ఆ భూయజమానికి శ్రేయోదాయకం.

  • అసమానమైన ఆకారం కలిగిన ప్లాట్లు, చాలా మూలలు ఉన్న ప్లాట్లు, మధ్యలో వాలుగా గుంత మాదిరిగా ఉన్నప్లాట్లు, దక్షిణం, నైరుతి వైపు వాలుగా ఉన్న ప్లాట్లు నిర్మాణానికి అంత మంచివి కాదు.


నీటి ఉనికి


ప్లాట్ లోని ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య భాగంలో నీటి సదుపాయాలు చేసుకోవడం మంచిది. ఇది భూ యజమానికి దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఆగ్నేయ, దక్షిణ, నైరుతి భాగంలో నీటికి సంబంధించిన సదుపాయాలు ఉండకూడదు. ఇది యజమాని ఆరోగ్యం, జీవితం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది. ఇది బావి, సంప్, వర్షపు నీటి గుంత వంటి అన్ని రకాల నీటి నిర్మాణాలు ఇది వర్తిస్తుంది.


భవన ఆకారం


వీలైనంత వరకు భవనపు ఆకారం ఈవెన్ షేప్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. కార్డినల్ దిశలైన తూర్పూ, పడమర, ఉత్తర, దక్షిణాలలో కోతలు లేదా పొడిగింపులు ఉన్న భవన నిర్మాణంలో నివసించే వారి జీవితం మీద నెగెటివ్ ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఆగ్నేయం పెరిగితే ఇంట్లో పెద్దవారైన స్త్రీ లేదా పెద్ద కుమారుడి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.


సింహద్వారం


ఇంటి సింహ ద్వారం చాలా ముఖ్యమైంది.  ప్రహరీ గేట్ నుంచి నేరుగా సింహద్వార ప్రవేశం ఉండడం అన్నింటికంటే ఉత్తమమైంది. అలా ఉండే అవకాశం లేనపుడు గేట్ నుంచి లోపలికి ప్రవేశించిన తర్వాత సవ్యదిశలో మలుపు తీసుకుని సింహద్వారం ద్వారా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండాలి. అలా కాకుండా అపసవ్య దిశలో సింహద్వారం ఉండడం మంచిది కాదు. ఇలాంటి సింహ ద్వారాలను ఏర్పాటు చేసుకోకూడదు.


చెట్లు, విద్యుత్ స్థంభాలు, నీటి గుంటలు, సంప్, టీజంక్షన్ వంటి రోడ్లు, ఎలాంటి అడ్డంకులు ద్వారానికి ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లే. సింహద్వారానికి ఉపయోగించే కలప కూడా చాలా ముఖ్యం. దీనికి వాడే కలప నాణ్యమైనదిగా ఉండేలా చూసుకోవాలి.


మొక్కలు వాస్తు


ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు భాగాల్లో పచ్చదనం ఉండడం మంచిది. ఎత్తుగా పెరిగే మొక్కలు పశ్చిమ, నైరుతి, దక్షిణ భాగంలో శుభదాయకం. ముళ్ల మొక్కుల ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదు. అలాగే రసాలు కలిగిన పండ్ల చెట్లు, పాలు కారే మొక్కలు కూడా ఇంటి యజమానికి అతడి కుటుంబ సభ్యుల పైన చెడు ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఇలాంటి చెట్లను తీసేయ్యడం సాధ్యం కానపుడు ఇంటికి ఈ చెట్లకు మధ్య వాస్తుకు అనుకూలమైన మొక్కలు లేదా చెట్లు పెంచడం మంచిది. అశోక, సాల్, కొబ్బరి, చెరకు, మగ్నోలియా వంటి చెట్లు వాస్తు అనుకూలమైన చెట్లు. తులసి వంటి మొక్కులు కూడా పవిత్రమైనవి, తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాల్సిన మొక్కలు. తులసిని ఎప్పుడూ దక్షిణ దిశలో నాటకూడదు. రకరకాల ఎనర్జీలు రకరకాల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన జీవితాలను ఈ ఎనర్జీస్‌ను అనుసరించి నడుచుకుంటూ ఉంటాయి. వీలైనంత వరకు మన పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి.