దేవుడి పూజలో హారతి ఇవ్వాలంటే తప్పకుండా కర్పూరం ఉండాల్సిందే. త్వరగా మండే స్వభావం కలిగిన కర్పూరం నుంచి వచ్చే సువాసన మనలో ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది. ఒక చక్కని ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. కర్పూరాన్ని కేవలం హారతి కోసమే కాదు.. పెళ్లి దండల్లో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, ఎక్కువ సేపు గాల్లో ఉంటే త్వరగా ఆవిరైపోతాయి. అందుకే వాటిని ఎల్లప్పుడు కవర్లు లేదా బాక్సుల్లో పెట్టి మాత్రమే నిలవ ఉంచాలి. అయితే, ఈ కర్పూరం మనలో దైవ చింతనే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అవేంటో తెలుసుకోండి మరి. 


కర్పూరం  ప్రయోజనాలు తెలిసిన వారు చాలా తక్కువ మంది. పూజకు మాత్రమే కాదు రోజు వారీ జీవితంలో ఔషధంగా, సుగంథ ద్రవ్యంగా, కీటక నాశినిగా, మరెన్నో రకాలుగా కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. హిందువులకు కర్పూరం చాలా పవిత్రమైంది. ఏ పూజైనా హారతి లేకుండా పూర్తవదు. అంతేకాదు రకరకాల పరిహారాల్లోనూ వాడుతారు. ఎన్నో ఇబ్బందులకు పరిష్కారాన్ని చూపిస్తుంది. జీవితాన్ని మార్చేయ గల మంచి సాధనం. చాలా సమస్యలకు మంచి పరిష్కారం చూపగలదు. మార్కెట్ లో రెండు రూపాయలకే దొరికే కర్పూరం ప్రయోజనాలు తెలియజేయండి.


కర్పూరం ఒకటే ఉపయోగాలు అనేకం


కర్పూరం ప్రత్యేకమైన రసాయనం. ఇది ఒక మొక్కనుంచి లభిస్తుంది. కర్పూరం సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది.



  • జపనీస్

  • భీమ్సేని

  • ప్రతి కపూర్


కర్పూరాన్ని పూజకోసం, ఔషధంగానూ, సువాసనకు ఉపయోగిస్తారు. నెగెటివ్ ఎనర్జీని తరిమేసేందుకు కూడా ఉపయోగిస్తారు. కర్పూరం సువాసన ఆహ్లాదంగా మాత్రమే కాదు ఇది ఏకాగ్రతను కూడా కలిసగిస్తుంది. దీని అగ్ని కఫ, వాతాలను సంతులన పరుస్తుంది కూడా.


ఔషధంగా కర్పూరం


కర్పూర నూనె చర్మంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. వాపులు తగ్గిస్తుంది. మొటిమలు, జిడ్డు చర్మానికి మంచి పరిష్కారం. కీళ్ల నొప్పులు ఉన్న వారు కర్పూర మిశ్రమాన్ని లేపనంగా రాసుకుంటే ఉపశమనం దొరుకుతుంది. కర్పూరం కలిగిన బామ్ రాసుకుంటే మెడనొప్పి తగ్గుతుంది. కఫం కారణంగా ఛాతి పట్టేసినట్టు ఉంటే కర్పూర నూనె రాస్తే ఉపశమనం కలుగుతుంది. తలనొప్పికి శొంఠి, తెల్లచందనంతో కర్పూరం కలిపి చేసిన లేపనపు కట్టు మంచి పరిష్కారం. కర్పూరం వేడినీటిలో వేసుకుని ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన దగ్గుకు ఆవ నూనె లేదా నువ్వుల నూనెలో కలిపిన కర్పూరంతో మర్ధనా చేస్తే త్వరగా తగ్గుతుంది.


కర్పూరం జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో జుట్టు రాలడం, త్వరగా చుండ్రు రావడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తునే ఉన్నాయి. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి వాడితే చుండ్రు నుంచి విముక్తి దొరుకుతుంది. అంతే కాదు జుట్టు కూడా రాలడం తగ్గుతుంది.


రూమ్ ప్రెషనర్‌గా..


కర్పూరాన్ని మెత్తగా పొడి చేసి లావెండర్ నూనెలో కలిపి స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేస్తే ఇల్లు సువాసనతో ఘుమఘుమ లాడుతుంది. మంచి ఎయిర్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. చర్మం మీద దురదలు, మంటగా ఉంటే ఉపశమనం కోసం ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక చెంచా కర్పూరం కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మడమల పగుళ్ల సమస్య ఉన్నవారు వేడి నీటిలో కర్పూరం వేసి అందులో కాళ్లు ఉంచాలి. ప్రతి రాత్రి నిద్ర పోయే ముందు ఇలా చేస్తే త్వరలోనే పగుళ్లు తగ్గుతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.