కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతోంది. కొన్నాళ్లుగా మాస్టర్ ప్లాన్ పై రైతులు చేస్తున్న ఆందోళనలకు సంక్రాంతి పండగ కాస్త బ్రేక్ ఇచ్చినా తిరిగి అన్నదాతలు నిరసనలు మొదలెట్టారు. రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఇక ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లొల్లి కౌన్సిలర్ల వైపు తిరిగింది. ఇప్పుడు అధికార పార్టీ కౌన్సిలర్లకు మాస్టర్ ప్లాన్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఓ వైపు కౌన్సిలర్లు రాజీనామా చేయాలని ఇప్పటికే రైతులు ఒత్తిడి తెస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రచ్చలో కౌన్సిలర్లు టార్గెట్ గా మారారు.
మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగిసింది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని తీర్మానం చేయాలంటూ అన్నదాతలు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు కూడా సమర్పించారు. పండగ సెలబ్రేషన్ ముగియడంతో కామారెడ్డి మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్ మొదలైంది.
మాస్టర్ ప్లాన్ రచ్చలో కౌన్సిలర్లు టార్గెట్...
ప్రస్తుతం రైతులు మున్సిపల్ కౌన్సిలర్లను టార్గెట్ చేస్తున్నారు. 20 వ తేదీలోపు కౌన్సిలర్లు రాజీనామా చేయాలని, లేకపోతే వారి ఇళ్లను ముట్టడి చేస్తామని విలీన గ్రామాల కౌన్సిలర్లకు రైతులు అల్టిమేటం జారీ చేశారు. మాస్టర్ ప్లాన్ లో ఉన్న విలీన ప్రాంత కౌన్సిలర్లు 9 మంది ఉన్నారు. ఇందులో 7 గురు అధికార పార్టీకి చెందిన వారు ఉండగా ఇద్దరు బిజెపి కౌన్సిలర్లు ఉన్నారు. ఈ నెల 18న బీజేపీ కౌన్సిలర్లు రవి, శ్రీనివాస్ పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు.
బీజేపీ కౌన్సిలర్ల రాజీనామతో మిగతా కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అన్నదాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ రచ్చతో మున్సిపల్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు విలీన ప్రాంతాలకు చెందిన 7 గురి పై మరింత ఒత్తిడి పెంచేలా రైతులు వారి ఇళ్ల ముట్టడికి రెడీ అవుతున్నారు.
జగిత్యాలలో మొదలైన సర్పంచ్ ల రాజీనామాలు
తిమ్మపూర్ గ్రామ సర్పంచ్ మేరుగు రమ్య - లక్ష్మణ్ పాలకవర్గం మాస్టర్ ప్లాన్ నిరసిస్తూ రాజీనామా కు సిద్ధమైంది. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ సమర్పించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో రైతు జేఏసీ భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ పై పోరాటం చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ రగడ కొనసాగుతూనే ఉంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేవరకు తగ్గేదే లే అంటున్నారు రైతులు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఐక్య కార్యాచరణ ప్రకటించింది రైతు జేఏసీ. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మూడు వారాలుగా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఇటీవల సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో విలీన గ్రామాల రైతులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ లోపు విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయాలని నిర్ణయించారు. లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని రైతులు తీర్మానం చేశారు. మాస్టర్ ప్లాన్ పై కోర్టుల చుట్టూ తిరగడానికి ఖర్చు అవుతుందని, కోర్టు ఖర్చుల కోసం మద్దతు తెలిపే నాయకులు తమతో పాటు ఒక్కొక్కరు రూ. 10 లక్షలు ఇవ్వాలని వెంకట రమణ రెడ్డి కోరారు.