సైన్స్ మాత్రమే కాదు, జీవ పరిణామ క్రమం గురించి పురాణాలు కూడా చాలా చర్చ చేశాయి. అలాంటి కథలు ఎన్నో ప్రాచూర్యంలో ఉన్నాయి. అయితే సైన్స్ ప్రకారం జీవ పరిణామం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక జీవి కొన్ని దశాబ్ధాలకాలంలో నెమ్మదిగా మార్పు జరిగి మరో రకం జీవులుగా మార్పు చెందుతాయి. కానీ పురాణాకథల్లో అకస్మాత్తుగా ఒక జీవి ఇంకో జీవిగా పరిణామం పొందింది.
కప్పల పరిణామ క్రమం గురించి గ్రీకుల పురాణాల్లో ఒక కథ ప్రాచూర్యంలో ఉంది. అప్పటి ప్రజలు రాత్రి, చీకటికి చెందిన దేవతగా లటోనాను పూజించేవారు. ఈమెను లాటో అని పిలిచేవారు. జ్యూఆస్ అనే దేవుడి భార్య అయిన హేరా శాపానికి లాటో గురవుతుంది. ఫలితంగా ఆమె భూమి మీద అందరికి దూరమవుతుంది. తన ఇద్దరు పసిపిల్లలతో ఒక చోటు నుంచి మరో చోటుకు దేశదిమ్మరిలా తిరుగుతుంటుంది.
ఒకరోజు ఆమె లైసియా అనే పచ్చని ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అప్పటికే ఆమెకు దాహం వేస్తుంటుంది. అక్కడ శుభ్రమైన నీటితో నిండి ఉన్న ఒక కొలను కనిపిస్తుంది. అక్కడే కొన్ని వెదురు చెట్లు నరికేసి కనిపిస్తాయి. వాటి పక్కనే కొలను ఒడ్డున పచ్చిక మీద తన పిల్లలను పడుకోబెట్టి నీళ్లు తాగడానికి మోకాళ్ల మీద కూర్చుంటుంది. అదే సమయంలో అక్కడికి ఆ చెట్లు నరుకుతున్నవారు వస్తారు. వారు ఆమెను చూసి చాలా తీవ్రమైన స్వరంతో ఆమె అక్కడి నీళ్లు తాగడానికి నిరాకరిస్తారు.
‘‘ఈ సూర్య కాంతి, గాలీ, నీరు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇవి అందరి కోసం. నా వంతు భాగం నేను తీసుకునే హక్కు నాకూ ఉంది కదా, ఎందుకు మీరు నన్ను నీళ్లు తాగకుండా అడ్డుకుంటున్నారు? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను కాళ్లు కడుగను ఈ నీటితో కేవలం దాహం మాత్రమే తీర్చుకుంటాను. నా మీద కాస్త జాలి చూపించండి. దాహంతో ప్రాణం పొయ్యేలా ఉంది. నాకోసం కాకపోయినా దాహంతో అలమటిస్తున్న ఈ పసివారి కోసమైనా నన్ను కనికరించండి’’ అని నెమ్మదిగా తలపైకెత్తి వినమ్రతతో వారిని కోరుతుంది.
ఆమె జాలి కలిగించే మాటలు వారి కఠిన హృదయాలను కదిలించలేకపోయాయి. ఆమె అక్కడి నుంచి వెళ్లకపోతే దాడి చెయ్యడానికి కూడా వెనుకాడేది లేదని వారు బెదిరిస్తారు. అంతేకాదు నిలకడగా తేట పడిన నీళ్లున్న కొలనులో కాళ్లు పెట్టి తాగేందుకు వీలు లేకుండా నీటిని మురికిగా మారుస్తారు. అది చూసి లటోనా కు చాలా కోపం వస్తుంది. తాను దాహంగా ఉన్న విషయం కూడా మరిచిపోయి, వారిని వేడుకోవడం కూడా ఆపేసి.. ఆగ్రహంతో రెండు చేతులు పైకెత్తి ఆకాశానికేసి చూస్తూ.. ‘‘ఇక వీళ్లు ఎప్పటికీ ఈ కొలను నుంచి బయటపడరుగాక, ఇక్కడే ఈ కొలనులోనే జీవితాంతం ఉండిపోదురు గాక’’ అని శపిస్తుంది.
ఆమె మాట పూర్తవుతూనే.. ఆ వ్యక్తులు తమ ప్రమేయం లేకుండానే కొలనులోకి దూకి వారి ఆకృతి మార్చుకోవడం మొదలు పెడతారు. వారి శరీరాలు పొట్టివిగా మారిపోవడం మొదలయింది. కాళ్లు, చేతులు చిన్నవిగా మారి శరీరానికి దగ్గరగా వచ్చాయి. చర్మం రంగు ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, జేగురు రంగులోకి మారిపోయింది. మెడ మాయం అయిపోయింది. వారు మాట్లాడేందుకు ప్రయత్నించినపుడు వారి గొంతులు నుంచి కేవలం బెకబెకలు తప్ప.. మాటలు రాలేదు. ఆరోజు నుంచి కొలనులు కప్పలకు ఆవాసాలుగా మారిపోయాయి. రాత్రి వేళల్లో బెకబెకలాడుతూ కొలనును ఆవాసాలుగా చేసుకొని జీవిస్తున్నాయి.
Also Read: ఆకాశ గంగ నుండి శ్రీవారి ఆలయానికి పవిత్ర జలాలు ఎందుకు తీసుకొస్తారంటే !
Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!