Gautam Adani Becomes World's 2nd Wealthiest Man: సంపద సృష్టిలో గౌతమ్ అదానీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్‌ తాజా సమాచారం ప్రకారం ప్రపంచంలోనే రెండో అత్యధిక సంపన్నుడిగా అవతరించారు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ అర్నాల్ట్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ను వెనక్కి నెట్టేశారు. శుక్రవారం అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ సంపద మరో రూ.40,000 కోట్లు (5 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. దాంతో ఆయన నెట్‌వర్త్‌ 155.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.


ఇక మస్క్‌తో ఢీ!


ప్రస్తుతం అదానీకి పోటీగా టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ఉన్నారు. ఆయన 273.5 బిలియన్‌ డాలర్ల సంపదతో అందరి కన్నా ముందున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ విల్మార్‌ వంటి కంపెనీల షేర్ల ర్యాలీతో ఆయన సంపద విలువ మరింత పెరిగింది. ఎల్‌వీఎంహెచ్‌ సీఈవో అర్నాల్ట్‌, అమెజాన్‌ స్థాపకుడు బెజోస్‌ను దాటేలా చేసింది. ప్రస్తుతం అర్నాల్ట్‌ 155.2 బిలియన్ డాలర్లు, బెజోస్‌ 149.7 బిలియన్‌ డాలర్ల సంపదతో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచారు.


రాకెట్లా షేర్ల ధర


ద్రవ్యోల్బణం భయాలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు ఆందోళనతో స్టాక్‌ మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. అయినప్పటికీ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మాత్రం పరుగులు పెట్టాయి. గ్రూప్‌లోని ఏడుకు ఏడు కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏకంగా 4.97 శాతం ఎగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 3.27, అదానీ టోటల్‌ గ్యాష్ 1.14, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 2, అదానీ పోర్ట్స్‌ 2.1, అదానీ పవర్‌ 3.45, అదానీ విల్మార్‌ 3.03 శాతం లాభపడ్డాయి. మొత్తంగా అన్ని కంపెనీల మార్కెట్‌ విలువ రూ.20.11 లక్షల కోట్లకు చేరుకుంది.


ఫోర్బ్స్‌ టాప్‌-10 రిచ్‌ లిస్ట్‌


1. ఎలన్‌ మస్క్‌
2. గౌతమ్‌ అదానీ
3. బెర్నార్డ్‌ అర్నాల్ట్‌
4. జెఫ్‌ బెజోస్‌
5. బిల్‌ గేట్స్‌
6. లారీ ఎలిసన్‌
7. వారెన్‌ బఫెట్‌
8. ముకేశ్ అంబానీ
9. లారీ పేజ్‌
10. సెర్గీ బ్రిన్‌


బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం వెనకే!


ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం అదానీ రెండో స్థానానికి ఎగబాకినా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం మూడో స్థానంలో ఉన్నారు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ కన్నా ఒక బిలియన్‌ డాలర్‌ తక్కువ సంపదతో ఉన్నారు. ఏదేమైనా ఆయన టాప్‌-3లోకి వచ్చిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డు సృష్టించారు.