Holi Festival 2023:  'హోలీ' అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను..హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ గురించి పురాణాల్లో ప్రచారంలో ఉన్న కథలేంటంటే...


2023 మార్చి 8 బుధవారం హోలీ
హోలీని ఆనందాల ‘డోలిక’ అంటారు. ఈ వేడుక ఎందుకు జరుపుకోవాలి, ప్రత్యేకత ఏంటో వివరిస్తూ పురాణాల్లో ఎన్నో కథలున్నాయి... దివాలీ తర్వాత దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకునే పండుగ 'హోలీ. ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మర్నాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకుంటారు. చతుర్దశి రోజు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్‌లోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు పురాణాల్లో ఉంది. 


Also Read: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో బాగా రాణిస్తారో తెలుసా!


హోలిక అనే రాక్షసి దహనమైన రోజు
రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడైన ప్రహ్లాదుడు నిత్యం అష్టాక్షరి మంత్రంలో మునిగితేలుతుంటాడు. అది గిట్టని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకుని సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తిని వినియోగించి ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలంటాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు మంటల్లోంచి బయటపడగా...హోళిక మాడి మసైపోతుంది. అంటే హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.  హోలికా దహనం చూస్తే కష్టాలు తీరుతాయని చెబుతారు..అయితే కొత్తగా పెళ్లైన వారు హోలికా దహనం చూస్తే వారి జీవితంలో కష్టాలు వస్తాయని అందుకే చూడకూడదని చెబుతారు. 


రాత్రివేళ రాక్షసికి పూజలు
కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు రాజ్యంలో ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి గురించి మొరపెట్టుకున్నారు. ‘హోళిక’ అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని చెప్పడంతో..ఆ సమయంలో అక్కడే ఉన్న నారదుడు ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని చెబుతాడు. అయితే ఆ పూజను రాత్రివేళ చేయాలనడంతో అప్పటి నుంచి రాత్రి వేళ హోలీ పూజలు నిర్వహిస్తున్నారు.


Also Read: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!


కామదహనం జరిగింది ఈ రోజే 
సతీవియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకుంటారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగిస్తాడు. ఆగ్రహం చెందిన శివుడు మూడోకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల  హోలీ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.


కృష్ణుడిని ఉయ్యాలలో వేసిన రోజు (డోలోత్సవం)
శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం, పూర్ణిమ తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి ‘డోలికోత్సవం’ జరుపుతారు. ఈ హోలి రోజున శ్రీకృష్ణుడు..రాధను ఊయలలో కూర్చోబెట్టి ప్రేమగా రంగులు చల్లాడని కూడా చెబుతారు. 


శాస్త్రీయ కారణం ఏంటంటే..వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటున్నారు..వీటివల్ల మంచి జరగకపోగా ఆరోగ్యానికి హానికరం కూడా....