Festivals in July 2025 : ఆషాఢ మాసం జూన్ 26నుంచి ప్రారంభమవుతోంది..జూలై 24 వరకూ ఉంటుంది. ఈ నెలరోజుల్లో ఎన్ని పండుగలున్నాయో తెలుసా... జూన్ 26 బోనాలు ( ఆషాఢ శుద్ధ పాడ్యమి)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల సందడి ఏటా ఆషాఢంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 26 గురువారంతో ఆషాఢం ప్రారంభంకావడంతో బోనాల సందడి ఇదే రోజు ప్రారంభం. అంటువ్యాధులు ప్రబలకుండా రక్షించాలని ఆరోగ్యాన్నివ్వాలని అమ్మకు బోనం సమర్పిస్తారు
జూన్ 26 వారాహీ నవరాత్రులు ప్రారంభం (( ఆషాఢ శుద్ధ పాడ్యమి)
ఏటా ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటూ వారాహీ నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజు శరన్నరాత్రుల్లానే దీక్షగా అమ్మవారిని పూజిస్తారు. ఉపవాసాలుంటారు. వారాహీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.
జూన్ 27 పూరీ జగన్నాథ రథయాత్ర ( ఆషాఢ శుద్ధ విదియ)
ఏటా ఆషాఢమాసం రెండో రోజైన విదియ రోజు పూరీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరుగుతుంది. ఏడాదంతా గర్భగుడిలో పూజలందుకునే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ నెలలో భక్తజనం మధ్యకు వస్తారు. పది రోజుల పాటూ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి.
జూలై 06 తొలి ఏకాదశి
దేవతలకు పగటి కాలాన్ని ఉత్తరాయణం అని, రాత్రి కాలాన్ని దక్షిణాయనం అని చెబుతారు. ఆషాఢంలో వచ్చే ఈ ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడని పురాణాల్లో ఉంది. అంటే దేవతలకు రాత్రి కాలం ప్రారంభమైందని చెప్పేందుకు సూచన ఇది.
జూలై 10 గురు పూర్ణిమ
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలు మాత్రమే కాదు మహాభారతం, భాగవతం సహా అష్టాదశపురాణాలు అందించాడు వ్యాసుడు. ఆయన అందిన ఆధ్యాత్మిక సంపద కారణంగా ఆదిగురువుగా పూజిస్తారు. వ్యాసమహర్షి జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు గురువులకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు.
జూలై 12 గురు మూఢమి ఆఖరు
జూలై 13 సికింద్రాబాద్ మహంకాళి జాతర
జూలై 17 కర్కాటక సంక్రాంతి
ఆదిత్యుడు నెలరోజులకు ఓ రాశిలో అడుగుపెట్టే రోజుని సంక్రమణం అంటారు. మకర రాశిలో అడుగుపెట్టినప్పుడు జరుపుకునేదే మకర సంక్రాంతి.. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అలా జూలై 17న కర్కాటక రాశిలో అడుగుపెడతాడు సూర్య భగవానుడు. ఈ రోజు కర్కాటక సంక్రాంతి అని పిలుస్తారు. అంటే దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు అన్నమాట.
జూలై 20 లాల్ దర్వాజా సింహవాహినికి బోనాలు
జూలై 24 చుక్కల అమావాస్య
ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈ అమావాస్యనే చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు వివాహిత మహిళలు దీపస్తంభ వ్రతం ఆచరించి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. సంతానం, సౌభాగ్యం కోసం ముత్తయిదువులు ఈ నోము నోచుకుంటారు.
జూలై 25 శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది...
అత్యాచార బాధితురాలి శాపమే ఇరాన్ ని పట్టిపీడిస్తోందా? రెండు దశాబ్దాల క్రితం ఏం జరిగింది? కర్మ ఫలం అంటే ఇదేనా!.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.
తింటున్న భోజనం బాగోలేదంటూ విమర్శిస్తూ తింటారు కొందరు..ఆ ఆహారం ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి