Curse of Atefah Sahaaleh 

ఆగస్టు 15, 2004 ఉదయం

16 ఏళ్ల అతేఫా సహాలేహ్ కి ఇరాన్ కోర్టు ఉరిశిక్ష విధించింది

అందరూ చూస్తుండగా బాలికను బహిరంగంగా ఉరితీశారు

ఆమె తప్పు చేయలేదు..పైగా బాధితురాలు

అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైంది

ఆమెకు న్యాయం చేయాల్సిందిపోయి ఉరితీశారు

ఈ ఘటనతో ఇరాన్ దేశం మొత్తం అట్టుడికింది

ఇంత దారుణమా అని ప్రపంచ దేశాలన్ని బాలికకు మద్దతుగా గొంతెత్తాయి

రెండు దశాబ్ధాల క్రితం ఇరాన్ న్యాయస్థానం అమలు చేసిన ఉరిశిక్ష సంచలనం రేపింది

మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు నెటిజన్లు...

నిండు సభలో ద్రౌపదిని అవమానించినందుకు ప్రతిగా కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. మహిళను అవమానించిన వారుమాత్రమే కాదు చూస్తూ ఊరుకున్నవారు కూడా అంతమైపోయారు

మాయావిగా వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణుడికి, లంకేయులకు ఎలాంటి గతి పట్టిందో రామాయణంలో ఉంది ఇప్పుడు ఆ బాలికకు జరిగిన అన్యాయమే..ఇరాన్ ను శాపమై పట్టిపీడిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆ బాలికకు చేసిన అన్యాయానికి ఇన్నేళ్ల తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటోంది.  ఇజ్రాయెల్ దాడులతో వందలమంది ఇరానియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటే ఆ 16 ఏళ్ల బాలిక శాపమేనా అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. 

2004లో జరిగిన ఈ సంఘటన తర్వాత నుంచి ఇరాన్ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయంటున్నారు. ప్రస్తుత పరిస్థితి కూడా ఈ కోవకే చెందుతుందని ఆనాడు జరిగిన సంఘటనను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇరాన్ లో నేకా నగరానికి చెందిన అతేఫా సహాలేహ్ కి పవిత్రతకు వ్యతిరేకంగా నేరం చేసిందంటూ మరణశిక్ష విధించారు. వాస్తవానికి ఇతర దేశాల్లో అత్యాచారానికి గురైతే బాధితురాలిగా పరిగణిస్తారు. కానీ ముస్లిం దేశం అయిన ఇరాన్ లో కన్యత్వాన్ని కోల్పోయినందుకు ఆమె దోషిగా నిలబడాల్సి వచ్చింది. కనీసం ఆమె ఆవేదన ఏంటో చెప్పుకునే అవకాశం కల్పించకుండానే నేరస్థురాలిగా తీర్మానించారు. అప్పటికీ ఆమె హిజాబ్ తొలగించి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది కానీ దాన్ని కూడా తప్పుగా పరిగణించింది న్యాయస్థానం. ఉరిశిక్ష విధించడమే కాదు బహిరంగంగా అమలుపర్చారు.

అతేఫా సహాలేహ్ చిన్నప్పుడే తల్లిదండ్రులను ఓ ప్రమాదంలో కోల్పోయింది. సోదరుడు నదిలో పడి చనిపోయాడు. అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది అతేఫా. కుటుంబ సభ్యులంతా కూలికోసం ఇంటికి దూరంగా వెళ్లాల్సి వచ్చేది. ఇంట్లో ఒంటరిగా ఉండేది 15 ఏళ్ల అతేఫా. ఇది గమనించాడు పక్కింట్లో ఉన్న 51ఏళ్ల అలీ. ఒంటరిగా ఉన్న ఆమెను అత్యాచారం చేయడమే కాదు ఈ విషయం ఎవరితో అయినా చెబితే చంపేస్తానని బెదిరించి వందలసార్లు శారీరికంగా హింసించాడు. ఆ బాధను భరించలేకపోయిన అతేఫా పోలీసులను ఆశ్రయించింది. ఇదే ఆమెకు శాపమైంది. కన్యత్వాన్ని పోగొట్టుకున్న మహిళ..షరియా చట్టం ప్రకారం బాధితురాలు కాదు నేరస్తురాలు. ఈ నేరం కిందే ఆమెను జైల్లో పెట్టారు. అక్కడ కూడా లైంగిక వేధింపులకు గురైంది అతేఫా సహాలేహ్. ఈ విషయం న్యాయస్థానం వరకూ చేరింది కానీ ఆమెకు న్యాయం జరగలేదు సరికదా కన్యత్వాన్ని కోల్పోయిన నేరం కింద ఉరితీశారు.  

అతేఫా సహాలేహ్ ని ఉరితీసేనాటికి ఆమె వయసు 22 ఏళ్లని , వ్యభిచార నేరానికి పాల్పడిందని కోర్టు చెప్పింది. కానీ ఆమె వయసు 16 సంవత్సరాలు అని కొందరి వాదన. ఇరానియన్ చట్టాల ప్రకారం 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారిని ఉరితీయకూడదు. అతేఫా సహాలేహ్ విషాద గాధను ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అతేఫాను ఉరితీసినప్పటి నుంచీ ఇరాన్ ప్రజలకు శాంతి లేదని పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితికి కూడా ఆ బాలిక శాపమే కారణం అనే చర్చ జరుగుతోంది. 

అతేఫా కథ విన్నవారంతా ఇదేం న్యాయం? ఇదెక్కడి చట్టం? ఇంత అన్యాయమా? ఆమె శాపం తగిలింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు. శాపాలు, పాపాలు తగలడంలో వాస్తవం ఎంత అంటే ప్రూవ్ చేసే సాక్ష్యాలు లేకపోవచ్చేమో..కానీ చేసిన కర్మకు తగిన ఫలితం అనుభవించక తప్పదని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. 

గమనిక: సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం