Legendary Mothers of Mythology: అక్షరానికి, ఉపన్యాసానికి అందనిది అమ్మ ప్రేమ. ప్రేయసి అందాన్ని వర్ణించగలరు, రాజులో వీరత్వాన్ని పొగడగలరు..కనిపించని దేవుడిని కూడా స్తుతించగలరు..నవరసాలను అక్షరరూపంలో మలచగరు..కానీ అమ్మను వర్ణించే సంపద ఏ కలానికి, కుంచెకి లేదు. పంచిన ప్రేమ, పెంచిన జ్ఞానం, నేర్పించిన సంస్కారం...వీటన్నింటికీ నిలువెత్తు కృతజ్ఞతతో కళ్లుమూసుకుని చేతులు జోడించి ప్రేమగా నమస్కరించడం తప్ప.. అమ్మకు ఇంతకు మించి ఏమీ ఇవ్వలేం..అసలు పిల్లల నుంచి ఏమీ ఆశించనిదే అమ్మ.
“కు పుత్రో జాయేత క్వచిదపి కు మాతా న భవతి ”
అన్నారు ఆదిశంకరాచార్యులు...
ఎక్కడైనా, ఎప్పుడైనా చెడ్డకుమారుడు ఉంటాడేమో కానీ చెడు తల్లి ఎక్కడా ఉండదు అని అర్థం...
అందుకే తామున్న పరిస్థితులేవైనా, అండగా నిలబడాల్సిన కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి వచ్చినా..జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురైనా అడుగడుగునా అమ్మ ఎన్నికష్టాలైనా పడుతుంది..కానీ..పిల్లలకి మాత్రం అడుగులకు మడుగులు ఒత్తుతుంది. ఇలా అనుకోని కష్టాల్లో చిక్కుకున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేసి అమ్మగా నూటికి వెయ్యిమార్కులు సాధించిన లెజెండరీ మదర్స్ పురాణాల్లోనూ ఉన్నారు..
Also Read: దేవుడు అమ్మను సృష్టించడం కాదు - అమ్మే దేవుడికి జన్మనిచ్చింది!
సీతాదేవి - లవకుశలు
జనకుడి ఇంట పుట్టిన సీతమ్మ అల్లారుముద్దుగా పెరిగింది. శివధనస్సుని ఎక్కుపెట్టిన శ్రీరామచంద్రుడితో వివాహం అనంతరం అయోధ్యలో అడుగుపెట్టింది. అత్తవారింటి ఎంత ఘనస్వాగతం లభించిందో...ఆ తర్వాత క్షణమే భర్త రాఘవుడితో అడవులకు పయనమైంది. పోనీ అడవిలో అయినా ఆనందంగా ఉందా అంటే...శూర్పణఖ ద్వారా సీత అందం గురించి విని ముగ్ధుడైన రావణుడు మాయా సన్యాసి వేషంలో వచ్చి ఎత్తుకెళ్లిపోయాడు. ఎట్టకేలకు రామ-రావణ యుద్ధం తర్వాత మళ్లీ అయోధ్యలో అడుగుపెట్టింది..శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగింది. ఇక మహారాణిగా భోగాలు అనుభవించాల్సిన సమయంలో..లోకుల నిందలకు సమాధానంగా మళ్లీ వనాల్లోనే వదిలిపెట్టేశాడు రాముడు. అప్పటికే సీతమ్మ తల్లికాబోతోంది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరిన సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చింది. నిరంతరం తండ్రిపై ప్రేమను తెలియజేస్తూ మహారాజు వారసులుగా వాళ్లకి అవసరమైన యుద్ధవిద్యలు నేర్పిస్తూ అత్యుత్తమంగా తీర్చిదిద్దింది.
కుంతి - పాండవులు
కుంతి...పాండురాజు భార్య, పాండవుల తల్లి, శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని సోదరి. అతిథులను ఆదరించే కుంతి ఓసారి దూర్వాస మహర్షి ద్వారా ఓ మంత్రోపదేశం పొందుతుంది. అంటే ఆ మంత్రోచ్ఛారణ చేసి ఏ దేవుడిని కోరుకున్నా వారు ప్రత్యక్షమై వారి అంశలో పిల్లలు జన్మిస్తారని ఆశీర్వదిస్తాడు. అది నిజమో కాదో అని చేసిన ప్రయత్నమే సూర్యుడి ద్వారా కర్ణుడి జననం. తప్పనిపరిస్థితుల్లో కర్ణుడిని వదులుకోవాల్సి వచ్చింది. పాండురాజుతో వివాహం అనంతరం తనకున్న శాపఫలితంగా వంశం నిర్వీర్యం అవుతుందని పాండురాజు ఆవేదన చెందుతాడు. ఆసమయంలో తనకున్న మంత్రోపదేశం శక్తి గురించి చెప్పి.. భర్త అంగీకారంతో యమధర్మరాజు, ఇంద్రుడు, వాయువు, అశ్వినీదేవతలను స్మరించి పాండవులకు జన్మనిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి పాండురాజు మరణిస్తాడు. అప్పటి నుంచి పాండవులను వీరులుగా తీర్చిదిద్దడం మొదలు కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించేవరకూ అడుగడుగునా ధైర్యం నూరిపోసి ముందుకునడిపించింది కుంతి.
Also Read: ఈ రోజు రాశిఫలాలు (12/05/2024)
శకుంతల - భరతుడు
మేనక-విశ్వామిత్రుల సంతానం శకుంతల. తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన ఈ చిన్నారి కణ్వమహర్షి ఆశ్రమంలో పెరిగింది. కొంతకాలానికి ఆ ప్రదేశానికి వేటకు వచ్చిన దుష్యంతుడు ఆమెను మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఫలితంగా ఆమె ఓ బిడ్డకు జన్మనిస్తుంది.. తనే భరతుడు. శాపఫలితంగా దుష్యంతుడి నుంచి తిరస్కారానికి గురైనప్పటకీ ఆమె కుంగిపోలేదు. ఒంటరిగా కొడుకుని పెంచాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. యువరాజుని యోధుడిగా తీర్చిదిద్దింది.
హిడింబి - ఘటోత్కచుడు
తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి..మనసులో మాట వెల్లడించింది. అయితే కొంతకాలం మాత్రమే కలసి ఉండగలను అని చెప్పిన భీముడి షరతులకు అంగీకరించి గాంధర్వ వివాహం చేసుకుంటుంది. వీరి ప్రేమకు సాక్ష్యమే ఘటోత్కచుడు. కేవలం ఉత్తమ ప్రేమికురాలిగానే కాదు ఆదర్శనీయమైన అమ్మ హిడింబి. ఘటోత్కచుడు జన్మించిన కొంతకాలానికి భీముడు ఆమెను విడిచి... సోదరులతో కలసి అజ్ఞాతవాసానికి వెళ్లిపోయాడు. భీముడికి ఇచ్చిన మాటప్రకారం వారిని అనుసరించకుండా ఆగిపోయిన హిడింబి.. మాయలు, మంత్రాలు, యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని అద్భుతంగా తీర్చిదిద్దింది. అనుక్షణం పాండవుల గొప్పదనం గురించి చెబుతూ వారిపై అభిమానం కలిగిలా చేస్తుంది. అవసరం అయినప్పుడు వారికి సహకారం అందిచాలన్న తల్లి ఆజ్ఞ మేరకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడి ప్రాణాలు కోల్పోయాడు ఘటోత్కచుడు. శక్తివంతమైన ఒంటరి తల్లిగా మహాభారతంతో హిడింబిది కీలక పాత్ర.
Also Read: నేడు జగద్గురు ఆది శంకరాచార్యులు 1236వ జయంతి.. అద్వైత సిద్దాంతకర్త గూర్చి ఈ విషయాలు మీకు తెలుసా?
జాబాల-జాబాలి
తోటివారంతా విద్యను అభ్యసిస్తుంటే జాబాలి అనే కుర్రవాడికి కూడా విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగింది. గౌతముడు అనే ఋషి దగ్గరకు వెళితే.. నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గోత్రం ఏమిటో చెప్పు’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలియని జాబాలి తల్లి దగ్గరకు వచ్చి అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది.. నీ పుట్టుకకు కారణం ఎవరో నాకు కూడా తెలియదు. నా పేరు జాబాల కాబట్టి నా కుమారుడమైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటూ వస్తున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉందని నమ్ముతున్నాను. ఎప్పుడూ సత్యమే మాట్లాడు అందుకు గుర్తుగా నీకు సత్యకాముడు అనే పేరు పెడుతున్నాను అని చెప్పి పంపించింది. ఆ తర్వాత గురువుగారింట పశువుల కాపరిగా విధులు నిర్వర్తించి మొదట ప్రకృతి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని అనంతరం గౌతముడి దగ్గర విద్యను అభ్యసించాడు. జాబాలిని పురాణాలు ఒక ఋషిగా గుర్తించి ఆ పేరుమీద గోత్రాన్ని సుస్థిరం చేశారు.
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!