Garuda Purana: మరణం మార్చ‌లేని సత్యం. ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం త‌ప్ప‌నిస‌రి. ఈ లోకంలో జన్మించినవారు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ల‌డం త‌ప్ప‌ద‌ని శాస్త్రాల్లో, గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. ఆత్మను ఎవరూ నాశనం చేయలేరని భ‌గ‌వ‌ద్గీతలో మరణం గురించి గీతాచార్యుడు వివ‌రంగా తెలియ‌జేశాడు. ఆత్మ నాశ‌నం లేన‌ది, అమరమైనది. అగ్ని దానిని కాల్చలేదు, నీరు దానిని తడ‌ప‌లేదు, గాలి చ‌లింప చేయ‌లేదు.


మరణానంతరం మరణించిన వారి ఆత్మకు ఏమి జరుగుతుందనే ప్రశ్న తలెత్తడం స‌హ‌జం. వైష్ణవ సంప్ర‌దాయానికి సంబంధించిన గ్రంథం, 18 మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో మీరు ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కనుగొంటారు. గరుడ పురాణంలోని 271 అధ్యాయాలలో 16 అధ్యాయాలు మరణం, మరణానంతరం ఆత్మ‌ ప్రయాణం, స్వర్గం-నరకం మొదలైన వాటి గురించి స‌మ‌గ్రంగా వివ‌రించాయి.


Also Read : ఇలాంటి పనులు చేసేవారికి వచ్చే జన్మలో ఏమవుతుందో తెలుసా?


గరుడ పురాణంలో, శ్రీ మ‌హా విష్ణువు తన వాహనం పక్షిరాజైన‌ గరుత్మంతుడికి జనన, మరణాల‌ గురించి ప‌రిపూర్ణంగా విశ‌దీక‌రించాడు. దీని ప్రకారం, మరణం తరువాత క‌ర్మ‌ల‌ను అనుస‌రించి ఆత్మ నరకంలో బాధలు అనుభ‌వించాల్సి ఉంటుంది లేదా స్వర్గాన్ని పొందుతుంది. ఇది జీవితంలో ఆ వ్యక్తి చేసే పనులపై ఆధారపడి ఉంటుంది.


పాప, పుణ్యం ఖాతా


గరుడ పురాణంలో మరణం తరువాత ఆత్మ తన పాప పుణ్యాల లెక్కలు చేసే వివిధ మార్గాల గుండా వెళుతుందని వివ‌రించారు. దీని తరువాత మాత్రమే ఆత్మ తదుపరి ప్రయాణం నిర్ణ‌యం జ‌రుగుతుంది. మరణానికి కొద్దిసేపటి ముందు ఒక వ్యక్తి స్వరం ఆగిపోతుందని, శరీరంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయని, జీవితంలోని చివరి క్షణంలో వ్యక్తికి దైవిక దర్శనం లభిస్తుందని కూడా ఇందులో ప్రస్తావించారు. దీని తరువాత మాత్రమే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అప్పుడు య‌మ‌ధ‌ర్మ‌రాజుకు చెందిన ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. జీవించి ఉన్న‌ప్పుడు వ్య‌క్తి ఇతరులతో ప్రవర్తిస్తాడో.. ఈ ప్ర‌యాణంలో మార్గ మ‌ధ్య‌లో యమదూతలు ఆత్మతో అదే విధంగా ప్రవర్తిస్తారు.


మూడు మార్గాల్లో ఆత్మ ప్ర‌యాణం


గరుడ పురాణంలో మరణం తరువాత ఆత్మ మూడు మార్గాల గుండా వెళుతుందని తెలిపారు. ఇందులో మొదటిది స్వర్గలోక మార్గం. రెండవది పితృలోక మార్గం. మూడవది న‌ర‌క‌లోక మార్గం. ఇందులో మొదటి మార్గంలో జీవితంలో కేవలం పుణ్యకార్యాలే చేసి పాపాలకు దూరంగా ఉండే వారు వెళతారు. పితృలోక మార్గం ప్రయాణాన్ని పితృలోక ప్రయాణం అంటారు. మరోవైపు, మూడవ మార్గం మాత్రం చాలా విధ్వంసక మార్గం. ఇది నరకానికి ప్రయాణం, ఇందులో ఆత్మ చాలా బాధను ఎదుర్కోవలసి వస్తుంది. బతికి ఉన్నప్పుడు ఏయే పనులు చేసింటారో వాటి ఆధారంగా వారిని ఏ మార్గంలో పంపాలనేది నిర్ణయిస్తారు.


Also Read : ఇవి పర్సులో మీ పర్సులో ఉంటే సంక్షోభం తప్పదు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.