Garuda puranam: హైందవ సంస్కృతిలో దానధర్మాలు చేయడం అత్యంత పుణ్య కార్యంగా పరిగణిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని, ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలలోనూ ఆ దాన ఫలితం లభిస్తుందని విశ్వసిస్తారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన దాన ఫలాలను మరణానంతరం కూడా పొందుతాడని అంటారు. మనం ఉత్తమమైన దానిని దానమిస్తే, భగవంతుడు సంతోషించి మనకు అదృష్టం కలిగేలా దీవిస్తాడని భావిస్తారు.
గరుడ పురాణంలోని ఆచారకాండలో, నీతిసార అధ్యాయంలో, సంతోషకరమైన సంపన్నమైన జీవితం కోసం ఏం చేయాలో ప్రస్తావించారు. అందులో ఒకటి 'దానం'. ఓ శ్లోకంలో దాన ధర్మాల ప్రాముఖ్యాన్ని, అవి ఎప్పుడు చేయాలో సమగ్రంగా వివరించారు. దీన్ని జీవితంలో అలవర్చుకుంటే ధనానికి లోటుండదని గరుడ పురాణంలో తెలిపారు.
దాన ధర్మాల ప్రాముఖ్యత
గరుడ పురాణంలో చెప్పినట్లుగా, పేదరికంలో ఉన్నప్పుడు దానధర్మాలు చేయకూడదు. పేదవాడిగా ఉన్నప్పుడు దానం చేయడం వల్ల మరింత పేదవాడిగా మారవచ్చు. అలాగే మీ ప్రతిష్ట కోసం దానధర్మాలు చేయడం మానుకోండి. బదులుగా మీకు వీలైనంత దానం చేయండి. సంపదకు మించిన దానం ఇవ్వడం మీకు భారం కావచ్చు. ఫలితంగా మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. ఒక వ్యక్తి తాను సంపాదించిన డబ్బు లేదా సంపాదనలో పదో వంతు అంటే పది శాతం మాత్రమే దానం చేయాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మీరు చేసే దానం అవతలి వ్యక్తికి అత్యవసరం అయినప్పుడే చేయాలని అప్పుడే మీరు చేసిన దానానికి తగిన ఫలం లభిస్తుందని స్పష్టంచేశారు.
Also Read: గరుడ పురాణం ప్రకారం వీరి నుంచి ఆహారం తీసుకుంటే నరకానికే
ధనం ఉంటే పొంగిపోవద్దు
'ధనం లేనప్పుడు కృంగిపోకు, డబ్బున్నప్పుడు పొంగిపోకు’ అని పెద్దలు చెబుతుంటారు. మీరు ఈ మాటను గుర్తుంచుకుని పాటించగలిగితే జీవితంలో బాధపడాల్సిన పరిస్థితి రాదు. మీకు అవకాశమున్నంత మేరకు ఖచ్చితంగా పేదలకు, అన్నార్తులకు సహాయం చేయండి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
పిల్లలకు సంస్కారం నేర్పండి
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎల్లప్పుడూ మంచి లక్షణాలు నేర్పాలి. పెద్దలను గౌరవించేలా, ఎవరికైనా మర్యాద ఇచ్చేలా తీర్చిదిద్దాలి. తమ పిల్లలను సంస్కారవంతులుగా తయారు చేయని తల్లిదండ్రులు ఏదో ఒక రోజు సమాజంలో అవమానానికి గురవుతారు. కాబట్టి మంచి పనులు, ఆలోచనలతో పిల్లలను పెంచాలి.
ఇతరులకు నష్టం కలిగించకూడదు
మీ స్వలాభం కోసం ఎవరికీ చెడు చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు పాపం మూటగట్టుకుంటారు. చాలా మందికి ఇలాంటి చెడు అలవాట్లు ఉంటాయి. మీ ప్రయోజనాల కోసం మీరు ఇతరులను ఉపయోగించుకున్నప్పుడు అది మీకు క్షణిక ఆనందాన్ని, తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ, భవిష్యత్‌లో దాని ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల పాప భారం పెరుగుతుందని గుర్తుంచుకోండి.
Also read: దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహం ఉందా - అయితే ఇదిగో క్లారిటీ!
మంచి వ్యక్తుల సహవాసం
ఇతరులతో కలిసి ఉండటం ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే మోసం, అన్యాయం చేసే వ్యక్తులతో కలిసి ఉండకుండా, అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. మనం ఎప్పుడూ మంచి వ్యక్తులు, నిజాయితీపరులతోనే సహవాసం చేయాలి. ఇది సమాజంలో మన గౌరవం, ప్రతిష్ఠను పెంచి ప్రత్యేక స్థానం ఇస్తుంది.