స్నేహమంటే కూచుని కబుర్లు చెప్పుకోవడం కాదు...అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం కాదు... కష్టనష్టాల్లో తోడుగా నిలవడం...మంచి చెడులు చెప్పడం....ఎలాంటి సందర్భంలోనూ ఆపార్థం చేసుకోకుండా ఉండడం. అపార్థం అనే మాటే వచ్చిఉంటే కర్ణుడు-దుర్యోధనుడి స్నేహం పురాణాల్లో నిలిచిఉండేది కాదేమో.....
దుర్యోధనుడంటే అందరికీ దుర్గ్మార్గుడిగానే తెలుసు. కానీ స్నేహానికి ఎంతో విలువనిచ్చే వ్యక్తి అని ఎంతమందికి తెలుసు? కౌరవ –పాండవుల విలువిద్య ప్రదర్శన సభలో కర్ణుడిని చూసినప్పటి నుంచీ తన జీవిత చివరి క్షణం వరకూ ప్రతి సందర్భంలోనూ తమ స్నేహం ఎంత గొప్పదో చాటిచెబుతూనే వచ్చాడు దుర్యోధనుడు. తన భార్య భానుమతి-స్నేహితుడు కర్ణుడి మధ్య జరిగిన ఘటనలో దుర్యోధనుడి స్పందన చూసి ఆశ్చర్యం కలుగుతుంది. స్నేహితుడిని ఇంతలా నమ్మగలరా ఎవరైనా అనిపిస్తుంది….
ఒకరోజు దుర్యోధనుడిని కలిసేందుకు వెళతాడు కర్ణుడు. ఆ సమయంలో దుర్యోధనుడు రాజ్యంలో ఉండడు. ఒకవేళ తన మందిరంలో ఉన్నాడేమో అనే ఆలోచనతో అక్కడకు వెళతాడు. ఆ సమయంలో దుర్యోధనుడి భార్య భానుమతి…. తన చెలికత్తెతో కలసి చదరంగం ఆడుతుంది. లోనికి వచ్చిన కర్ణుడిని చూసి చెలికత్తే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆటలో మునిగిపోయిన భానుమతి ఎదురుగా చెలికత్తె లేదని గమనించదు…కర్ణుడు వచ్చినట్టూ చూడలేదు. ఎంతసేపు చూస్తావ్…ఆడు అని అంటుంది. అక్కడ కర్ణుడు తప్ప మరెవ్వరూ లేకపోవడంతో తననే ఆడమని అడిగిందనే ఉద్దేశంతో కర్ణుడు ఆటలో కూర్చుంటాడు. ఎదురుగా ఎవరున్నారు…ఎవరితో ఆడుతున్నాం అన్నది కూడా గమనించనంతగా ఆటలో మునిగిపోతారిద్దరూ.
ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆటసాగుతుంది. ఆట ముగింపు దశకు వస్తుంది. మరికొద్దిసేపట్లో భానుమతి కర్ణుడి చేతిలో ఓడిపోనుంది. ఇక ఆటలో ఓడిపోతానని భానుమతికి అర్థమయ్యే సమయంలో....దుర్యోధన మహారాజు వేంచేస్తున్నారహో అనే భటుల మాటలు వినిపిస్తాయి. వెంటనే భర్తకు ఎదురెళ్లేందుకు ఆట దగ్గర నుంచి లేస్తుంది భానుమతి. ద్వారానికి ఎదురుగా భానుమతి కూర్చోవడంతో భర్త రాకని గమనించి ఎదురెళ్లాలని అడుగేస్తుంది. అప్పటికీ ఆటలోనే మునిగిపోయి ఉన్న కర్ణుడు…ఓడిపోతున్న కారణంగా లేచి వెళ్లిపోతోందని భావిస్తాడు. ఎక్కడికి వెళతావు ఆడు అని తలపైకెత్తకుండానే చేత్తో పట్టుకుని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో భానుమతి కర్ణుడికి వెనుకగా అడుగేయడంతో ఆమె చీరకొంగు చేయికి తగులుతుంది. వెంటనే ఆ కొంగును పట్టుకుని లాగడంతో నడుముకి ఉన్న ముత్యాల వడ్డాణం తెగి మందిరం మొత్తం ముత్యాల చెల్లా చెదురుగా పడిపోతాయి. అప్పటికి కానీ తాము ఇప్పటి వరకూ ఎవరితో ఆడాం అన్నది అర్థంకాదు.
నేలరాసిన ముత్యాలు….అప్పుడే మందిరంలోకి వచ్చిన దుర్యోధనుడు….ఎదురుగా కర్ణుడిని గమనించిన భానుమతి….ఏం జరిగిందో అర్థంకాని స్థితిలో కర్ణుడు. భర్తను చూసి భానుమతి ముఖం ఆందోళనతో నిండిపోయింది. ఆమె ముఖం చూసిన తర్వాత వెనక్కు చూసిన కర్ణుడు దుర్యోధనుడిని చూసి శిలలా నిల్చుండిపోయాడు. ఏం చెప్పాలో తెలియదు…దుర్యోధనుడు ఏం చేస్తాడో తెలియని భయంలో మునిగిపోయారు. భర్తకి ఏం చెప్పాలో భానుమతికి తెలియడం లేదు… అసలు విషయం చెబితే దుర్యోధనుడు వింటాడో లేదో అని కర్ణుడి ఆలోచన. కానీ అక్కడే ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. భానుమతి-కర్ణుడు ఎవరి ఆలోచనలో వాళ్లుండగానే…. దుర్యోధనుడు నేలపైకి వంగి….తాపీగా కిందపడిన ముత్యాలు ఏరి అవన్నీ తీసుకెళ్లి భర్య దోసిట్లో పోస్తాడు. నా స్నేహితుడు తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు దేవీ అని కర్ణుడి తరపున భానుమతిని క్షమాపణ అడుగుతాడు దుర్యోధనుడు.
పాండవులపై అసూయ ద్వేషాలతో రగిలిపోతూ నిరంతరం వారి పతనాన్ని కోరుకుని చివరికి కురువంశ వినాశనానికి కారణమయిన దుర్యోధనుడంటే అందరికీ విలన్ గానే తెలుసు. కానీ స్నేహానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది…..!