UPSC CMS Exam 2021: ఎంబీబీఎస్ విద్యార్థులకు శుభవార్త. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) 2021 సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (CMS) ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 838 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్ పూర్తయిన, చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కేటగిరీల వారీగా వీటిని భర్తీ చేయనుంది. కేటగిరీ - 1లో 349 పోస్టులు, కేటగిరీ - 2లో 389 పోస్టులను కేటాయించింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు జూలై 27వ తేదీతో ముగియనుంది. 
పోస్టుల వివరాలు.. 
కేటగిరీ - 1
సెంట్రల్ హెల్త్ సర్వీసులో జూనియర్ స్కేల్ పోస్టులు - 349
కేటగిరీ - 2
1. అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్ - 300
2. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 5
3. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (EDMC), నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) లలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 - 184
పరీక్ష విధానం.. 


ఈ పరీక్ష పార్ట్ - 1, పార్ట్ - 2 అనే రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగం (UPSC CMS 2021 Part 1 ) రెండు పేపర్లుగా ఉంటుంది. పార్ట్ - 1లో ఒక్కో పేపర్ కు 250 మార్కుల చొప్పున మొత్తం 500 మార్కులు కేటాయించారు. ఒక పరీక్ష రెండు గంటల పాటు కొనసాగనుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి 0.33 (1/3) మార్కులను కట్ చేస్తారు. పార్ట్ - 2లో క్వాలిఫై అయితేనే రెండో విభాగానికి (UPSC CMS 2021 Part II exam) అర్హులు అవుతారు. పార్ట్ - 2 అనేది పర్సనాలిటీ టెస్ట్. ఇది 100 మార్కులకు ఉంటుంది. 


ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉపసంహరించుకునే (విత్‌డ్రా) అవకాశాన్ని కూడా యూపీఎస్సీ కల్పించింది. ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులను విత్‌డ్రా చేసుకోవచ్చని సూచించింది. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

ముఖ్యమైన వివరాలు..
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఏడాది ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు ముగిసే తేదీ: జూలై 27, 2021 సాయంత్రం 6 గంటలు
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మిగతా కేటగిరీల అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.
వయసు: 2021 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: నవంబర్‌ 21, 2021
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/