ABP  WhatsApp

Sharmila: ఉమ్మడి శత్రువు కోసం కలిసి పని చేసిన సీఎంలు... ఉమ్మడి వివాద పరిష్కారానికి కూర్చోలేరా?

ABP Desam Updated at: 15 Jul 2021 03:12 PM (IST)

తెలంగాణ గడ్డపై కొత్త పార్టీతో ముందుకు వచ్చిన వైయస్​ షర్మిల.. సోదరుడు జగన్​పై పరోక్ష విమర్శలు చేశారు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.

sharmila

NEXT PREV

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదంపై వైయస్​ షర్మిల ఘాటుగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్లు, విందులు పెట్టుకున్నారని.. మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. రెండు నిమిషాలు కూర్చుని సమస్య పరిష్కరించుకోలేరా అని నిలదీశారు. హైదరాబాద్​ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె.. కేసీఆర్‌ పాలనను తీవ్రంగా విమర్శించారు.


సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుందని ఆరోపించారు. సమస్య పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదని ధ్వజమెత్తారు. న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోమని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతానికి చెందిన నీటిచుక్కను కూడా తీసుకోమని షర్మిల అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ సిద్ధాంతమని పేర్కొన్నారు.



"కృష్ణానదిపై రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్‌కు ఇప్పుడే తెలివొచ్చిందా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టొచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించొచ్చు. కానీ, రెండు నిమిషాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోలేరా? మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరు."- - వైయస్​ షర్మిల


ఆయన కల నెరవేర్చేందుకే: విజయమ్మ


పార్టీ ఆవిర్భావ సభలో షర్మిల తల్లి వైయస్​ విజయమ్మ భావోద్వేగంగా మాట్లాడారు. శత్రువులైనా.. వైఎస్‌ఆర్‌ను అభిమానించారని వైఎస్​ విజయమ్మ అన్నారు. నాయకుడంటే వైఎస్‌ఆర్‌లా ఉండాలన్నారు. నాయకుడంటే తన వాళ్ల కష్టాలు.. నష్టాలను భరించేవాడని, ప్రజల బతుకు కోరేవాడే నిజమైన నాయకుడని చెప్పారు. అలాంటి నాయకుడు వైఎస్‌ఆర్‌ ఒక్కరే అని అన్నారు. వైఎస్‌ఆర్‌ జనం కోసం జీవించారని తెలిపారు. ఆయన ఆత్మీయత, హావభావాలు జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని చెప్పారు.


తండ్రి ఆశయాల సాధనం కోసం మీముందుకు వస్తున్నారని, మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుందన్నారు. షర్మిలను మీ కుటుంబసభ్యురాలిగా అక్కున చేర్చుకోవాలని కోరారు



ఖమ్మం సభలో నా బిడ్డను మీకు అప్పగించాను. ఈ మూడు నెలల్లో షర్మిలను టార్గెట్​ చేస్తూ సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. కాంగ్రెస్​ పార్టీ వారు ఎంతో ప్రేమతో రాజశేఖర్​ రెడ్డిని తమ పార్టీ వారిగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్ 35 నుంచి 40 ఏళ్లు ​కాంగ్రెస్​కు సేవ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్​ఐఆర్​లో పేరు ఎందుకు పెట్టారు. వైఎస్సార్​ కుటుంబాన్ని రోడ్డు మీదికి తెచ్చింది కాంగ్రెస్​ కాదా. ఇదంతా ప్రజలు చూశారు. - -వైఎస్​ విజయమ్మ


అన్నపై వ్యంగ్యాస్త్రాలు..


ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై ట్వీట్​ చేసిన షర్మిల తాజాగా ఈ విషయంపై సోదరుడు జగన్​పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా జగన్​ను విమర్శించారు.





Published at: 08 Jul 2021 10:26 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.