Duryodhana Temple Malanada: రాక్షసులు కూడా దేవతల అనుగ్రహం ఆలయాలు నిర్మించి పూజలు చేశారని పురాణాల్లో ఉంది. అయితే దుష్టుడైన దుర్యోధనుడికి కూడా ఓ ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ పూజలందిస్తున్నారు కేరళ రాష్ట్రం మలనాడ వాసులు. దీనివెనుక పెద్ద కథే ప్రచారంలో ఉంది...


మహాభారత జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు. అరణ్యవాసం పూర్తిచేసుకున్న తర్వాత అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో ...వారిని పట్టుకునేందుకు దుర్యోధనుడు, శకుని చాలా ఎత్తులు వేశారు. ఇందులో భాగంగా పాండవుల జాడ తెలుసుకునేందుకు దుర్యోధనుడే ఓసారి వారిని వెతుక్కుంటూ వెళ్లాడు. ప్రయాణంలో అలసిపోయిన దుర్యోధనుడు కేరళ రాష్ట్రం మలనాడ చేరుకునేసరికి నీరసించిపోయాడు. ఓ దగ్గర సేదతీరేందుకు ఆగిన దుర్యోధనుడికి...ఓ మహిళ  కొబ్బరి కల్లు అందించిందట. రుచికరమైన కల్లుతో దాహం తీర్చుకున్న దుర్యోధనుడు..ఆ ఆనందంలో వారు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుని...తన రాజ్యంలో ఉన్న ఆ ప్రాంతాన్ని పూర్తిగా వారికి కానుకగా ఇచ్చేశాడు. ఆ విశ్వాసంతోనే మలనాడు ప్రజలు దుర్యోధనుడికి ఆలయం నిర్మించి పూజించడం ప్రారంభించారు. ఇది కేవలం ఓ మతానికే పరిమితం అయిన దేవాలయం కాదు... కులమతాలకు అతీతంగా మలనాడ వాసులంతా దుర్యోధనుడి ఆలయాన్ని సందర్శిస్తారు...


Also Read: గురువాయూర్ కి ఆ పేరెలా వచ్చింది - ఇక్కడ బాలగోపాలుడి విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలుసా!


యువరాజుకి సూచనగా వేదిక


ఇప్పటికీ వెదురు కర్రలతో దాదాపు 80 అడుగుల పల్లకి నిర్మించి అందంగా అలంకరించి ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. కేరళ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో దుర్యోధనుడికి ఇప్పటికీ కల్లు నైవద్యంగా సమర్పిస్తారు. దుర్యోధనుడితో పాటూ తన భార్య భానుమతి, తల్లి దండ్రులు, గురువు ద్రోణుడు, స్నేహితుడు కర్ణుడికి కూడా పూజలు చేస్తారు. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే ఈ ఆలయ గర్భగుడిలో విగ్రహం ఉండదు. యువరాజు కూర్చున్నాడని చెప్పేందుకు సూచనగా ఓ వేదిక మాత్రమే ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ దుర్యోధనుడిని దేవుడు అని అనుకోరు...అప్పుపన్ అని పిలుస్తారు..అంటే తాత అని అర్థం.   


Also Read: నారసింహస్వామి ఆలయం ఉన్న ఊర్లో కాకులుండవా - ఇందులో నిజమెంత!


దుర్యోధనుడితో పాటూ ఇతర కౌరవులైన దుశ్సాసన, దుస్సలకు కూడా ఈ సమీపంలో ఉన్న పవిత్రేశ్వరం వద్ద ఆలయాను నిర్మించారు. శకునికి కూడా మరో ఆలయం అంకితం చేశారు.  కొల్లం, తిరువనంతపురం, అలప్పుజ , పతనంతిట్ట జిల్లాల్లో  ఉన్న ఈ ఆలయాల్లో ప్రతిదానికీ ఓ ప్రత్యేక ఉంది.  దుర్యోధనుడి  ఆలయానికి వెళ్లాలంటే ముందుగా కొల్లాం చేరుకుని అక్కడి నుంచి మలనాడ వెళ్లాలి... దగ్గర్లో కారుణగపాపల్లి అనే రైల్వేస్టేషన్లో దిగినా మలనాడ చేరుకోవచ్చు. త్రివేండ్రం విమానాశ్రయంలో దిగినా వెళ్లేందుకు వీలుగా కార్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి. దుర్యోధన ఆలయంలో పాటూ ఇతర కౌరవుల ఆలయాలను కూడా తీర్థయాత్ర టూరిజం సర్క్యూట్‌లో భాగంగా చేయాలని భావిస్తోంది ప్రభుత్వం..






Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!