saturday donating these 5 things: సనాతన ధర్మంలో, శనైశ్చరుడిని కర్మ ఫలాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి తన పనులను ఎలా చేస్తాడనే దాని ఆధారంగా, తదనుగుణంగా అతను లేదా ఆమె ఫలితాలను పొందుతాడు.
శనైశ్చరుడిని ఆరాధించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి ఈ రోజు కొన్ని వస్తువులు దానం చేయవచ్చు. ఎందుకంటే ఈ దానాలు శనైశ్చరుడిని శాంతింపజేసి, ప్రసన్నం చేసుకునేందుకు దోహదం చేస్తాయి. ఫలితంగా ఆయన తన భక్తులను రక్షిస్తాడు. శనివారం దానం చేయవలసిన వస్తువుల వివరాలను మనం తెలుసుకుందాం.
ఆవ నూనె
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనివారం రోజు ఆవనూనెను దానం చేయడం లేదా ఆవనూనె ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. శని కారణంగా మీ జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే, శనివారం రోజు ఎక్కువగా ఆవనూనెను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శనివారం నాడు ఒక ఇనుప పాత్రలో ఆవాల నూనె తీసుకుని, అందులో ఒక రూపాయి నాణెం వేసి, ఆ నూనెలో మీ ముఖం చూసుకుని తర్వాత పేదవారికి దానం చేయండి. లేదంటే మర్రిచెట్టు కింద ఉంచండి.
నల్లని వస్త్రాలు, చెప్పులు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలా కాలంగా మిమ్మల్ని వ్యాధులు బాధిస్తుంటే, శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి నల్లని వస్త్రాలు, చెప్పులు దానం చేసి, ఆ వ్యక్తి నుంచి ఆశీర్వాదం పొందాలి. క్రమంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు.
ఇనుప పాత్రలు
శనివారం నాడు ఇనుప పాత్రలను దానం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు. మీ జాతకంలో శని ప్రమాద కారకంగా ఉంటే.. అట్ల పెనం, పటకారు వంటి ఇనుప పాత్రలను అవి అవసరమున్న వ్యక్తికి దానం చేయండి. ఈ రెమెడీ ద్వారా ప్రమాదాలను నివారించడం వల్ల మీరు సురక్షితంగా ఉంటారు.
నల్ల నువ్వులు, నల్ల మినప్పప్పు
మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, శనివారం సాయంత్రం 1.25 కిలోల నల్ల మినప్పప్పు లేదా నల్ల నువ్వులను దానం చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వరుసగా ఐదు శనివారాలు ఈ పరిహారం చేయండి. మీరు ఈ వస్తువులను దానం చేయడం ద్వారా త్వరలోనే అన్ని డబ్బు సంబంధిత సమస్యలు మీ జీవితం నుండి తొలగిపోతాయి.
గుర్రపు నాడా
ఏ రకమైన నివారణలోనైనా గుర్రపు నాడాకు ముఖ్యమైన స్థానం ఉంది. కానీ గుర్రపు నాడా కొత్తది ఉండకూడదని గుర్తుంచుకోండి. గుర్రం కాలుకు వాడిన నాడాను మాత్రమే ఉపయోగించండి. శుక్రవారం నాడు గుర్రపు నాడాను ఆవాల నూనెలో ముంచి, శనివారం ప్రధాన ద్వారంపై U ఆకారంలో ఉంచండి. ఈ పరిహారంతో కుటుంబ సభ్యులు శని దోషాల నుంచి బయటపడతారు. ఇంట్లో ఎలాంటి విభేదాలు ఉండవు ఫలితంగా మీ జీవితంలో శాంతి మరియు ఆనందం వెల్లివిరుస్తాయి.
Also Read : ఈ 4 వస్తువులను చేతికి అందుకోకూడదు, ఉచితంగా అస్సలు తీసుకోరాదు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial