Chaturmas 2023: ఈ ఏడాది చాతుర్మాసం జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి అన్ని శుభ కార్యాలను నిషేధిస్తారు. ఈ సంవ‌త్స‌రం చాతుర్మాసం సరిగ్గా 5 నెలల పాటు ఉంటుంది. చాతుర్మాస కాలాన్ని ఆషాఢ మాసంలోని ఏకాదశి నుంచి కార్తీక మాసంలోని ఏకాదశి వరకు పరిగణిస్తారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, శ్రీమహావిష్ణువు చాతుర్మాస సమయంలో 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ సమయంలో, రుషులు, సాధువులందరూ తపస్సులో నిమగ్నమై తీర్థయాత్రలు చేస్తారు. చాతుర్మాసంలో మనం ఏయే వస్తువులు దానం చేయాలో తెలుసా..? చాతుర్మాసంలో చేసే దాన విశిష్టత ఏమిటి..?


శుభకార్యాలు చేయకూడదు
దేవశయన‌ ఏకాదశి వ్రతం జూన్ 29వ తేదీన జరుపుకొంటారు. ఈ రోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. అందుకే ఈ సమయంలో శుభ కార్యాలు చేయ‌డాన్ని నిషేధించారు. వివాహం, నిశ్చితార్థం వంటి శుభకార్యాలు చేయడం స‌రికాద‌ని చెబుతారు.


చాతుర్మాసంలో చేయాల్సిన దానాలు
ఉద్యోగ, వ్యాపారాలలో ఆందోళనలు ఉన్నవారు లేదా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నవారు చాతుర్మాస సమయంలో గొడుగు, వస్త్రాలు, బియ్యం, కర్పూరం దానం చేయాలి. ఫ‌లితంగా ప‌ర‌మేశ్వ‌రుడిని త్వ‌ర‌గా ప్రసన్నం చేయ‌డంతో పాటు వారి కోరికలను నెరవేరుస్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్యాపార, ఆర్థికాభివృద్ధితో పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.


ఈ తప్పులు చేయవద్దు
సాధారణంగా చాతుర్మాసం 4 నెలల పాటు ఉంటుంది. అయితే, ఈసారి చాతుర్మాసం 5 నెలలు, ఈ 5 నెలల్లో మీరు నూనెతో వండిన‌ ఆహారం, చక్కెర, పెరుగు, నూనె, బెండకాయ, ఉప్పు, కారం, మిఠాయిలు, తమలపాకులు, మాంసం, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి.


చాతుర్మాసంలో ఈ మంత్రాలను జపించండి
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం విష్ణవే నమః                           
ఓం హుం విష్ణువే నమః                 
శ్రీ కృష్ణ గోవింద హరే మురారే|
హే నాథ్ నారాయణ వాసుదేవాయ||
సంపూర్ణ భక్తితో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.


Also Read : తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!


చాతుర్మాస సమయంలో పైన పేర్కొన్న పనులు చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. చాతుర్మాసంలో చేసే దానధర్మాలు కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీకు కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కావాలంటే చాతుర్మాసంలో ఈ పనులు చేయాల‌ని గుర్తుంచుకోండి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Also Read : చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!