కొంత మంది ఎంత కష్టపడి పనిచేసినా.. అనుకున్నది సాధించలేరు. అలా జరగడానికి కారణం.. మనం నివసించే చోట లేదా, పనిచేసే చోట వాస్తు సరిలేకపోవడం కూడా కావచ్చు. కాబట్టి అపజయాలు ఎదురవుతున్నపుడు ఒకసారి వాస్తు ఎలా ఉందో చూసుకోవడం అవసరమే. అలాగే పరిహారాలు కూడా చేసుకోవడం మంచిదే. సూర్యాస్తమయం సమయంలో ఈ పరిహారాలు చేస్తే ధనవంతులయ్యే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. కుటుంబం లో సుఖసంతోషాల కోసమే అందరూ శ్రమిస్తారు. అందుకోసమే కష్టపడి పనిచేస్తారు. కొంత మందికి గ్రహచారం సరిగా లేక అదృష్టం కలిసి రాదు కొందరికి, మరి కొందరికి వాస్తు సరిగా లేక నష్టం జరుగుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి తోడ్పడే పరిహారాలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి. వీటిని అనుసరించి దేవతల అనుగ్రహం పొందవచ్చు.
హిందు ధర్మంలో ఉదయ సంధ్య, సాయం సంధ్యలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయాలను ప్రదోశ వేళలు అంటారు. ఈ సమయంలో చేసే శుభకార్యాలు లక్ష్మీ కటాక్షానికి కారణం అవుతాయని చెబుతారు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి. ఇది సాకారత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది.
సాయం సమయంలో చేసే పూజ కు చాలా మహత్తు ఉంటుంది. సాయం సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో, తులసి ముందు దీపం వెలిగించాలి. సూర్యాస్తమయ సమయంలో అంటే సాయం సంధ్య వేళ ఇంట్లో దీపం వెలిగించి వెలుగును ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. చీకటి నెగెటివ్ ఎనర్జీకి ఆలవాలంగా ఉంటుంది. ఒకసారి నెగెటివిటీ ఇంట్లో ప్రవేశిస్తే కష్టాల పరంపర మొదలవుతుంది. అది మనశ్శాంతి దూరం చేస్తుంది. ఆర్థిక నష్టాలు కలిగించవచ్చు. కనుక ఇంట్లో చీకటి కాకుండా జాగ్రత్త పడడం అవసరం.
సంధ్య వేళలో నిద్రపోవడ మంచిది కాదు. అది ఉదయ సంధ్య అయినా సాయం సంధ్య అయినా సరే. అందుకే ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని పెద్దలు చెబుతుంటారు. సాయం సంధ్య వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇలా పడుకుంటే లక్ష్మి అలిగి వెళ్లి పోతుందట. సంధ్యా లక్ష్మీని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది.
సూర్యాస్తమయ సమయంలో తప్పనిసరిగా పితరులను తలచుకొని వారి దీవెనలకోసం వేడుకోవాలట. ఇలా చెయ్యడం వల్ల వంశంలోని పూర్వీకుల దీవెనెల వల్ల జీవితంలో దురదృష్టం ఎదురుకాకుండా ఉంటుంది. జీవితం విజయపథంలో నడుస్తుందని నమ్మకం. పితరుల దీవెనలు లేకపోతే జీవితంలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతాయని ప్రతీతి. కాబట్టి రోజు ఒకసారి పెద్దలను స్మరించుకొవడం వల్ల వారి దీవెనలు పొందవచ్చు. అందువల్ల కష్టాలు తీరిపోవచ్చు.
ఇలాంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా జీవితంలోకి సకారాత్మక శక్తిని ఆహ్వానించ వచ్చు. అకారణంగా కష్టాల పాలు కాకుండా మనలను మనం కాపాడుకోవచ్చు.
గమనిక: పండితులు, వివిధ ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.