Honour Killing Chittoor: కుప్పం - తమిళనాడు  సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకుండా కూతురుని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అల్లుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన అనుచరులతో కలిసి వెళ్లి నడిరోడ్డు మీదే అల్లుడిని అతి కిరాతకంగా నరికి చంపాడు. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపుతోంది.




అసలేం జరిగిందంటే..? 


కృష్ణగిరి జిల్లా కిట్టంపాటి గ్రామానికి చెందిన జగన్‌కి వయస్సు 28 సంవత్సరాలు. అదే గ్రామాకిని చెందిన 21 ఏళ్ల శరణ్య, జగన్ గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిదీ ఒకే కులం అయినప్పటికీ.. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దలను ఎదరించి అయినా సరే ఒకటవ్వాలనుకున్న వీళ్లు.. నెల రోజుల కిందటే కృష్ణగిరి జిల్లా అవతానపట్టి సమీపంలోని ముక్కాన్ కొట్టాయ్ ప్రాంతంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.


ఈ పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి శరణ్య తండ్రి కోపంతో రగిలిపోయాడు. తన కూతురును తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జగన్ పై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడిని హత్య చేయాలని పథకం పన్నాడు. సమయం రాగానే దాన్ని అమలు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తనతోపాటు మరో ఇద్దరు అనుచరులను తీసుకొని జగన్ పని చేసే చోటుకి వెళ్లాడు. కాస్త దూరంలోనే ఆగి టైం కోసం ఎదురు చూశాడు. ఈ ముఠా అక్కడే కాపు కాశారు. 


కాపు కాసి మరీ కత్తులతో దాడి - నడిరోడ్డుపై హత్య


తన పని ముగించుకొని  ఇంటికి వెళ్లేందుకు బైక్ బయల్దేరాడు జగన్. అటుగా వస్తున్న జగన్ ను గమనించిన.. మామ, ఆయన అనుచరులు త ప్లాన్‌ను అమలు చేశారు. ఒక్కసారిగా కత్తులతో జగన్ పై విరుచుకు పడ్డారు. తమతో తెచ్చుకున్న కత్తులతో  ఇష్టం వచ్చినట్లుగా నరికారు. సినిమాల్లో చూపించినట్టుగానే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు.


ఒకడ్ని పట్టుకొని అలా హత్య చేస్తున్న దృశ్యాలను చూసిన స్థానికులు వారించే ప్రయత్నం చేశారు. మరికొందరు అడ్డుకునేందుకు కూడా ముందుకు దూకారు. అయితే అలా సాహసాలు చేస్తే తలలు తెగుతాయని ఆముఠా హెచ్చరించింది. జగన్‌ను రక్షించేందుకు యత్నించిన  వాళ్ల మీదకు కూడా కత్తులు దువ్వారు.


జనాలు భారీగా గుమిగూడటం.. ఇంతలో రక్తపు మడుగులో కొట్టుకుంటున్న జగన్ చలనం లేకుండా పడిపోవడంతో చనిపోయాడని నిర్దారించుకొని ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జగన్ తరపు బంధువులు క్రిష్ణగిరి - ధర్మపురి జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. అలాగే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే జగన్ ను హత్య చేసిన కాసేపటికే మామ శంకర్ పోలీసులకు లొంగిపోయాడు. తనకు ఇష్టం లేని వాడని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతోనే అతడిని చంపినట్లు తెలిపాడు.