Lord Shiva: శివ పురాణం ప్రకారం, త్రిమూర్తుల‌లో అత్యంత శక్తిమంతుడిగా ప‌ర‌మ‌శివుడిని పేర్కొంటారు. ఆ మహాదేవుడు తన భక్తులు చేసే సాధారణ పూజలకూ చాలా సంతోషిస్తాడు. అందుకే ప‌ర‌మేశ్వ‌రుడిని బోళాశంక‌రుడు అని కూడా అంటారు. అయితే  శివుడు ఎంత భ‌క్త సుల‌భుడో ఆగ్ర‌హం వస్తే అంతే క‌ఠినంగా శిక్షిస్తాడు. 


ప‌ర‌మ‌శివునికి ఎవ‌రిమీద అయినా ఒక్కసారి కోపమొస్తే, విశ్వంలో ఎవరూ ఆయ‌న కోపాన్ని అదుపు చేయ‌లేరని అంటారు. శివుడు కోపంతో మూడో కన్ను తెరిచిన రోజున ప్రపంచం మొత్తం భ‌స్మీప‌ట‌లం అవుతుందని మత విశ్వాసం. అయితే మ‌హాదేవునికి విశ్వాన్ని నాశనం చేసేంత కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా?


నిర్మలమైన మనస్సుతో శివుని పూజించిన వారి కోరిన కోర్కెలు త్వరలో నెరవేరుతాయని భ‌క్తుల విశ్వాసం. మనుషులైనా, దేవతలైనా, గంధర్వులైనా, అసురులైనా ఎవరైతే భక్తితో పూజిస్తారో వారు తప్పకుండా గ‌ర‌ళ‌కంఠుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఆడంబ‌రంగా పూజ చేసినా, భ‌క్తితో ప‌త్రం స‌మ‌ర్పించినా ఆయ‌న త‌న‌ నిజమైన భక్తులను సమానంగా ఆశీర్వదిస్తాడు. అయితే శివుడికి కోపం వస్తే ఆ వ్యక్తి నాశనం అవుతాడు. శివ పురాణం శివుని కోపాన్ని ప్రస్తావిస్తుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల శివుడుకి మిమ్మల్ని క్షమించలేనంత కోపం వ‌స్తుంద‌ని చెబుతోంది.


1. స్త్రీ, పురుష సహజీవనం
శివ పురాణం ప్రకారం, ఒక స్త్రీ లేదా పురుషుడు తన భర్త లేదా భార్య కాకుండా మరే ఇతర స్త్రీ లేదా పురుషుడిని చెడు దృష్టితో చూస్తే, వారు పాపంలో భాగమవుతారు. అలాంటి వారు శివుని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీని కారణంగా మనిషి జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తాడు.


2. దానాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం
దానం చేసిన వస్తువులు లేదా ఇచ్చిన విరాళాన్ని తిరిగి తీసుకోకూడదు. అలా చేయ‌డం వ‌ల్ల ప‌ర‌మేశ్వ‌రుడికి కోపం వస్తుంది. ధ‌ర్మాన్ని అవమానించేవారిని శివుడు ఎప్పటికీ విడిచిపెట్టడని పెద్ద‌ల విశ్వాసం.


3. అమాయకులకు బాధ కలిగించడం
అనుమతి లేకుండా ఇతరుల సంపదను, ఆస్తులను ఆక్రమించేవారిని శివుడు ఎప్పటికీ క్షమించడు. చెడు పనుల కోసం దేవాలయంలో దొంగతనం చేయడం, అమాయకులను, అనాథ‌ల‌ను బాధపెట్టడం కూడా పాపపు పనులలో ఒకటిగా పరిగణిస్తారు. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు.


4. ఇతరుల గౌరవానికి భంగం క‌లిగించ‌డం
గర్భిణులు, పెద్ద‌లు, తల్లిదండ్రులతో కఠినమైన పదాలు మాట్లాడటం, వారి గౌరవాన్ని కించపరచడం క్షమించరాని నేరంగా శివపురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి పనులు చేసేవారు శివుని ఆగ్రహానికి గురికాకుండా ఉండలేరు. ఫ‌లితంగా ఆయ‌న విధించే శిక్షను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది.


Also Read : యోగాకి మాత్రమే కాదు సంగీతం,నాట్యం సహా ప్రతి విద్యకూ పరమేశ్వరుడే ఆద్యుడు!


శివ పురాణం ప్రకారం, ఈ 4 తప్పుడు పనులు చేసే వ్యక్తి ప‌ర‌మేశ్వ‌రుడి ఆగ్ర‌హానికి గురికావ‌ల‌సి వస్తుంది. ఫ‌లితంగా ఆ వ్య‌క్తి త‌న‌ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటాడు. మీరు అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకండి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.