కర్ణాటకలోని బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో కొలువైన క్షేత్రం ధర్మస్థల మంజునాథస్వామి ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు...భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవక్షేత్రం ఇదే. శైవక్షేత్రం అంటే శివలింగం, నందివిగ్రహాలే ఉంటాయనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇక్కడ శివుడితో పాటూ నలుగురు ధర్మదేవతలు, జైనులు కొలిచే బాహుబలి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక కార్తీకమాసంలో ఇక్కడ నిర్వహించే లక్షదీపోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవ్. సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలోని పరమేశ్వరుడిని హెగ్గడే కుటుంబానికి చెందిన జైనులు ప్రతిష్ఠించడంతో పాటు అప్పటినుంచీ వాళ్ల వారసులే ఆలయ బాధ్యతల్ని చూస్తున్నారు. శ్రీ క్షేత్రంగా, ధర్మస్థలగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో వైష్ణవులే అర్చకులుగా ఉండటం విశేషం.
Also Read: ఇంటి ముందున్న తులసి మొక్కను చూసి ఇంట్లో ఏం జరగబోతోందో తెలిసిపోతుందట... నిజమేనా!
స్థలపురాణం..
ధర్మస్థలను ఒకప్పుడు కుడుమ అని పిలిచేవారట. స్థానికంగా నివాసం ఉండే బీర్మన్న పెర్గడే, అమ్ము బల్లాల్తీ దంపతులు ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించేవారట. ధర్మదేవతలైన కాలరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారిలు ఓ రోజు రాత్రి ఈ దంపతుల కలలో కనిపించి ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలనుకున్నట్లుగా చెప్పడంతో ఆ మర్నాడే కుటుంబంతో సహా ఇల్లు వదిలివెళ్లిపోయాడట బీర్మన్న. కొన్నాళ్లకు అదే దేవతలు మళ్లీ కలలో కనిపించి తమ విగ్రహాలు ప్రతిష్ఠించమని చెప్పారట. ఆ సమయంలో పూజలు నిర్వహించిన పూజారులు కొందరు ఇక్కడ శివలింగం కూడా పెడితే బావుంటుందని అనడంతో అన్నప్ప అనే మరో భక్తుడు ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట. ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతి ఆలయాన్ని, అక్కడ జరుగుతున్న మంచిపనులు చూసి ధర్మస్థల అనే పేరు పెట్టారట.
తులాభారం
భక్తులు తమ కోరికలు నెరవేరాక బియ్యం, ఉప్పు, పూలు, బెల్లం, అరటి పండ్లు, నాణేలతో తులభారం తూగి స్వామికి మొక్కులు చెల్లిస్తుంటారు. ఆలయ సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మళ్లీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 :30 వరకు.
Also Read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!
బాహుబలిని మిస్సవొద్దు
ధర్మస్థల వెళ్లేవారు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం 'బాహుబలి క్షేత్రం'. రత్నగిరి కొండ మీద 39 అడుగులున్న ఈ ఏకశిలా విగ్రహం 170 టన్నుల బరువు ఉంటుంది. ధర్మస్థలలో ఒక కొండ పైభాగాన ధర్మ దేవతల నాలుగు మందిరాలు ఉంటాయి. వీటిలోకి స్త్రీలను, పిల్లల్ని అనుమతించరు. జైనుల దైవం చంద్రనాథ స్వామి మందిరంలో శిల్పకళ ఆకట్టుకుంటుంది. ధర్మస్థల కు 2 కిలోమీటర్ల దూరంలో నేత్రావది నది బ్యారేజ్ ఉంది. ఇక్కడే నేచర్ కేర్ ఆసుపత్, అందులో పంచభూత చికిత్స ఉంది.
బీర్మన్న వంశస్థులే ధర్మకర్తలు
ఈ ఆలయాన్ని నిర్మించింది బీర్మన్న కావడంతో అప్పటినుంచీ ఆ వంశస్థులే ఇక్కడ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నిత్యాన్నదానం నిర్వహించడమే కాదు..చుట్టుపక్కల ప్రాంతాలవారికి అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పన, పేదలకు పెళ్లిళ్లు, గ్రామాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.