అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడం ద్వారా అప్పుడు, తిప్పలు, కష్టాలు, నష్టాలు తొలగి ఆర్థికంగా ఓ మెట్టు పెకెక్కుతామని విశ్వసిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షం అంటే చంద్రుని వృద్ధి చెందుతున్న దశలో మూడవ రోజు తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి , లక్ష్మీ నరసింహ స్వామికి  ప్రీతికరమైన రోజు. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి ఆవునేతితో దీపారాధన చేసి, తియ్యటి పదార్థం నైవేద్యం పెడితే మీ జీవితంలో ఉన్న చెడు, బాధ అన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. 


Also Read: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...
  
ఇదే రోజు లక్ష్మీనరసింహ స్వామికి కూడా చాలా ఇష్టమైన రోజు. సింహాచలంలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలంలో సాయంత్రంవేళ స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. అందుకే  అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహస్వామికి చందనం అలంకరించి పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతారు. లక్ష్మీనరసింహ స్వామివారికి మాత్రం పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మిదేవి, వరాహనారసింహుడితో పాటూ కుబేరులను కూడా కొందరు పూజిస్తారు. 


Also Read:  ఇది ఆచార్య ధర్మస్థలి కాదు రియల్ ధర్మస్థలి, ఎక్కడుందంటే!


ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడమే కాదు దాన ధర్మాలు కూడా చేయడం ద్వారా ఆర్థిక, అనారోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడొచ్చని అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. విసనికర్ర, నూతన వస్త్రాలు, గుమ్మడికాయ, గొడుగు, పాదరక్షలు, పండ్లు..ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలను బట్టి దానం చేస్తే గ్రహబాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు.  బంగారం లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే స్తోమత లేని వాళ్ళు భక్తితో పూజించినా చాలు...


‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం’


అనే శ్లోకాన్ని పఠించాలి. ఇవేవీ కుదరకపోతే ‘ఓం హ్రీం ఐం మహాలక్ష్మైనమః’ అనే మూలమంత్రాన్ని జపిస్తూ ఆ తల్లిని అర్చించాలి.


Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు