Shayani Ekadashi 2025: హిందూ ధర్మంలో దేవశయన ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి దేవశయని ఏకాదశి 6 జూలై 2025 ఆదివారం వచ్చింది. దేవశయన ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మంచిది. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు.
ఈ రోజుకు మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ రోజు గురించి కొన్ని ప్రత్యేక నియమాలు సూచించారు పండితులు. భక్తి శ్రద్ధలతో వీటిని పాటిస్తే శుభ ఫలితాలు పొందుతారు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
దేవశయన ఏకాదశి ప్రాముఖ్యత పురాణ కథ
6 జూలై 2025 న దేవశయన ఏకాదశి వ్రతం చేస్తారు. పురాణాల ప్రకారం, ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువుకి చాలా ప్రీతికరమైనది. ఈ ఏకాదశి నుంచి వచ్చే 4 నెలల వరకు, శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ధ్యాన యోగ నిద్రలో నిద్రిస్తారు. ఈ ఏకాదశి వెనుక ఒక పురాణ కథ ఏమిటంటే, పూర్వకాలంలో రఘువంశానికి చెందిన ఒక రాజు ఉండేవారు, అతని పేరు మహారాజా మాంధాత. మంధాత అంటే ప్రజలు అత్యంత ప్రియమైన రాజు. రాముడి కన్నా రావణుడిని ఓడించిన మహారాజు మాంధాత. ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించే మాంధాత రాజ్యంలో మూడు సంవత్సరాల పాటూ వర్షాలు లేవు. పచ్చగా ఉండే రాజ్యంలో కరవు కాటకాలు రాజ్యమేలాయి. తమ పాపాల కారణంగా ప్రజలంతా ఈ కరవు ఎదుర్కొంటున్నారని భావించారు మాంధాత మహారాజు.
దేవశయని ఏకాదశి వ్రత పురాణ కథ
రాజ్యం మళ్లీ సుభిక్షంగా ఉండాలన్నా, ఈ సమస్య నుంచి బయటపడాలన్నా మహర్షుల నుంచి సూచనలు స్వీకరించాలని భావించిన మాంధాత అడవికి వెళ్ళారు. అడవిలో అంగీర రుషిని కలిశారు.. ఆయన బ్రహ్మదేవుడి కుమారుడు. మీ రాజ్యం మళ్లీ కళకళలాడాలంటే ప్రజలందరితో కలసి దేవశయన వ్రతం చేయండి అని సూచించారు. అనంతరం రాజు అంగిర ఋషి మాటలను పాటిస్తూ, తన కుటుంబం , ప్రజలతో కలిసి దేవశయని ఏకాదశి ఉపవాసం ఉండి, నియమబద్ధంగా పూజలు చేశారు. ఆ తరువాత రాజ్యంలో వర్షం కురిసింది. ప్రజలంతా సంతోషించారు.
దేవశయని ఏకాదశి సందర్భంగా, మహారాష్ట్ర పండరీపురంలో వేలాది భక్తులు శ్రీ హరి విఠల్ దర్శనం కోసం వెళతారు.
దేవశయని ఏకాదశి సందర్భంగా ఈ నియమాలను తెలుసుకోండి.
- తొలి ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండాలి.
- రోజంతా భగవంతుని నామస్మరణ చేయండి.
- ఈ రోజున దానం ధర్మం చేయడానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
- విష్ణు సహస్రనామం పఠించండి
- దేవశయన ఏకాదశి రోజున హనుమాన్ చాలీసా పఠించడం కూడా మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం భక్తుల నమ్మకాలు ఆధారంగా సేకరించినది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే ఆధ్యాత్మికవేత్తల సలహాలు స్వీకరించండి లేదంటే సంబంధిత నిపుణుడి సలహాలు అడిగి తీసుకోండి.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!