Darshan of Makarajyoti in Sabarimala : కోట్లాది మంది భక్తులు కన్నార్పకుండా చూస్తున్న అద్భుత ఘట్టం శబరిమలలో ఆవిష్కృతమయింది. అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతి దర్శనం సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగిపోయాయి.
మకర జ్యోతిని ప్రత్యక్షంగా 1.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల నమ్మకం. జ్యోతి దర్శనంకు ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయ్యప్ప భక్తులు ఏటా 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. కొంత మంది భక్తులు మెట్ల పూజకు వెళతారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు దీక్షను విరమిస్తారు. భక్తులను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే స్వయంగా మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు. పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడని నమ్ముతూ ఉంటారు.
మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు వచ్చిన భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు ఇబ్బంది లేకుండా చేసింది.
Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం