స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. కౌటిల్యుడు రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది. గుప్తల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు. ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ ఆర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు రాజనీతి, అర్థశాస్త్రాలను ఆకళింపు చేసుకున్నాడు.
మంచిప్రవర్తన
తెలివైన వ్యక్తికి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే విశిష్ట లక్షణం ఉంటుదట. వాస్తవానికి ఓ వ్యక్తి ప్రవర్తనే తెలివైనవాడా కాదా అనే అంశాన్ని నిర్ధరిస్తుందన్నాడు. వ్యక్తి విద్యా పరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానానికి కూడా కౌటిల్యుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరి కంటే ఎవరూ గొప్పవారు కాదని తెలిపాడు. ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో, అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బంధీ అయిపోతే ఎవరికీ మంచి జరగదని అన్నాడు. తెలివైనవాడు తన తోటివారికి తగిన గౌరవం ఇస్తాడు...జ్ఞానం ఉన్నా దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోతే అతడు తెలివైన వ్యక్తి కాదట.
అనవసర విషయాలు పట్టించుకోవద్దు
సాధారణ మనిషికి జీవితంలో కొన్ని విషయాలపై మాత్రమే నియంత్రణ ఉంటుంది. చాలా విషయాల్లో ఇతరుల సహాయం లేనిది ముందుకు సాగలేడు. అదే తెలివైవాడు కొన్నిసార్లు అనవసరమైన విషయాలను పక్కనబెట్టి ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోడానికి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తాడు. పెట్టుకున్న టార్గెట్ చేరుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు.
అయోమయం వద్దు..అవగాహన అవసరం
వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమ అహం, శౌర్యం, ఆత్మగౌరవం, అందం పట్ల ఆకర్షణతో ఆయోమయానికి గురవుతారు. ఇలాంటి సందర్భంలో తనకు అవసరమైంది ఏంటో అవగాహన చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి తెలివైన వ్యక్తి ప్రయత్నిస్తాడు. సమస్యలు ఎదురైనప్పుడు అహాన్ని పక్కనబెట్టి వాటిని పరిష్కరించుకోవాలట. ఏదైనా పని చివరి దశలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పని వల్ల ముప్పు తొలగిపోయినా అది ఎందుకు ఎదురయిందో తెలుసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనతో విలువైన సమయాన్ని వృథా చేయరాదు.
అహానికి మరో రూపం ప్రతిష్ట
ప్రతి అంశాన్ని ప్రతిష్టకు ముడిపెట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు కొందరు. అసలు ప్రతిష్ట అంటే ఏంటో తెలుసుకోవాలి. అహానికి మరో రూపమే ప్రతిష్ట కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు చాణక్యుడు. దీని వల్ల ఒరిగేదేం లేదు..పైగా అహం అన్నం పెట్టదు కదా అంటాడు చాణక్యుడు.
అనవసర విషయాలతో కాలయాపన చేసి టన్నుల కొద్దీ కాలం, శక్తిని వృథా చేసుకోకుండా అద్భుతాలు సృష్టించడానికి ప్రయత్నించండి. తెలివైన వ్యక్తి పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. వాటిపైనే మనసు కేంద్రీకరించి పక్కన జరిగే అనవసరమైన విషయాల గురించి పట్టించుకోడు. నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకున్న రోజు ఎంత పెద్ద సమస్య అయినా నీముందు చిన్నబోతుందంటాడు చాణక్యుడు.