చాణక్యుడి పేరు చెప్పేసరికి గొప్ప రాజకీయ గ్రంథం అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అంతేకాదు… తన అపారమైన రాజనీతితో వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి… మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి చాణక్యుడు. నంద వంశ నిర్మూలను మౌర్యవంశ స్థాపనకు కారకుడైన కౌటిల్యుడు కేవలం అర్థశాస్త్రం, రాజనీతిజ్ఞత మాత్రమే కాదు… న్యాయశాస్త్రానికి సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఇందులో భాగంగా ఏఏ సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చు… కలసి ఉన్నప్పుడైనా.. విడిపోయినప్పుడైనా స్త్రీధనం ఎవరికి చెందుతుంది… అత్తింటివారి ఆస్తిపై స్త్రీకి ఎంతవరకూ హక్కుంటుందో వివరించారు….





పెళ్లి జరిగినంత మాత్రాన భార్యపై సర్వాధికారాలు భర్తకి ఉండబోవని చెప్పిన చాణక్యుడు… ఏఏ సందర్భాల్లో భార్య… భర్తనుంచి విడాకులు పొందవచ్చో సూచించాడు.  భర్త పిచ్చివాడైనా, కుష్టు వ్యాధిగ్రస్తుడైనా , ఆమెకు భర్త వలన కుమారుడు జన్మించనప్పుడు ఆమె విడాకులు పొందొచ్చు.




కలసి ఉంటే ఆస్తులకు సంబంధించి గొడవే రాదు. ఇద్దర్లో ఏ ఒక్కరు మరణించినా... లేదా విడిపోయినా అప్పుడు ఆస్తుల గొడవలు మొదలువుతాయి. అలాంటప్పుడు ఏ ఆస్తి ఎవరికి చెందుతుంది.... సందర్భాన్ని బట్టి ఆస్తికి అసలు ఎవరు హక్కుదారులో ఎలా నిర్ణయిస్తారు…ఈ విషయాలపై కూడా చాణక్యుడు కొన్ని సూచనలు చేశాడు.



  1. స్త్రీ శీలవతికాకుండా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భర్తనుంచి సంక్రమించాల్సిన ఆస్తి ఆమెకు దక్కదు.

  2. వివాహ సందర్భంలో పుట్టింటివారు పెట్టిన నగలు, నగదుని స్త్రీధనం అంటారు. వాటిపై మాత్రమే ఆమెకు హక్కుంటుంది. భర్తనుంచి విడిపోయినప్పుడు స్త్రీధనం ఉపయోగపడుతుంది. ఇది 2వేల ఫణముల కన్నా ఎక్కువ ఉండాలని సూచించాడు చాణక్యుడు. భర్త నుంచి ఆమెకు సంక్రమించిన నగల విలువ ఎంతైనా ఉండొచ్చు. పిల్లలకు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా భర్త చనిపోయినప్పుడు… వింతతువు అయిన స్త్రీ అప్పుడు ఖర్చు చేయవచ్చు.

  3. మతపరమైన కార్యక్రమాలకు, దేశంలో కరువు కాటకాలు, విపత్తులు, వ్యాధులు ఉన్నప్పుడు వాటినివారణకు విరాళంగా స్త్రీ ధనాన్ని ఇవ్వొచ్చు.

  4. భర్త కన్నా భార్య ముందు మరణిస్తే.. ఆమె ఆస్తిని ఎలా పంచాలంటే…                                             



  • కొంత భాగం కుమారులకు ఇచ్చి…. మిగిలినది ఆడపిల్లలకు సమానంగా ఇవ్వాలి

  • కుమార్తెలు మాత్రమే ఉన్నట్టైతే అందరకీ సమానంగా ఇవ్వాలి

  • పిల్లలు లేకపోతే మొత్తం భర్తకే చెందుతుంది

  • భర్త చనిపోతే… స్త్రీధనంతో పాటూ భర్త ఆస్తి కూడా ఆమెకే చెందుతుంది.

  • ఒకవేళ పునర్వివాహం చేసుకుంటే.. మొదటి భర్త వల్ల సంక్రమించిన ఆస్తి మొత్తం కోల్పోవాల్సి ఉంటుంది.అయితే.. ఆమె భర్త సోదరుల్లో ఎవరినైనా అత్తింటివారి అనుమతితో పెళ్లిచేసుకుంటే మాత్రం యథావిధిగా ఆస్తి మొత్తం ఆమెకే దక్కుతుంది. అలాకానప్పుడు అత్తింటివారికి చెందుతుంది.

  • పునర్వివాహం చేసుకున్న స్త్రీకి… కుమారుడు పుడితే… ఆమె అత్తింటివారికి ఇచ్చేసిన ఆస్తిని తిరిగి పొందేహక్కుంటుంది.