Chanakya Niti Tips In Telugu:  కొలిమిలో వేడి చేసిన తర్వాత బంగారం ఎలా బయటపడుతుందో... అలా విజయం సాధించాలంటే చాలా అంకితభావం అవసరం అంటాడు ఆచార్య చాణక్యుడు. అందుకోసం మీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుండాలి..ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకునే తత్వం ఉండాలి, ఓటమినుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు అడుగువేసే మనోధైర్యం ఉండాలి. లేదంటే ఎన్నిసార్లు పోరాడినా ఓటమే కానీ గెలుపు సాధ్యం కాదు. జీవితంలో అయినా మీరున్న రంగంలో అయినా ఓటమిని ఎదుర్కోవాల్సిన వచ్చిందంటే అందుకు ఎదురైన సవాళ్లను స్వీకరించి పోరాటం చేయాలి. ముందుగా మిమ్మల్ని మీరు గెలవాలి, మీ ఆలోచనను స్థిరంగా ఉంచుకోవాలి...మీ మనసులో ఏదో భయంతో, సంకోచంతో అడుగు ముందుకువేస్తే అలాంటి వ్యక్తి ఎప్పటికీ గెలవలేడు. వాస్తవానికి గెలుపు ఓటమి అనేవి మనసులో భావాలు మాత్రమే. గెలుపు వచ్చినప్పుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై..ఓటమి రాగానే మనసులోనే కుంగిపోవడం తగదు. గెలిచినప్పుడు వినయంగా వ్యవహరించి...ఓటమి వచ్చినప్పుడు పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంగా ముందకు సాగినప్పుడే ఓటమి కూడా గెలుపుగా మారుతుంది. అలాంటి సక్సెస్ శాశ్వతంగా నిలుస్తుంది. ఈ స్థాయికి చేరుకోవాలంటే మీరు నేర్చుకోవాల్సినవి - విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి..


Also Read: Chanakya Niti In Telugu: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!
 
జ్ఞానం
ఒక వ్యక్తి జ్ఞానం తన గౌరవాన్ని మరింత పెంచుతుంది. అందుకే ఎప్పటికప్పుడు జ్ఞానసముపార్జన చేయాలి. జ్ఞానాన్ని పెంచుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వృధా చేయకూడదు.  


వినయం 
సక్సెస్ దరిచేరిందంటే చాలామంది ఆలోచనలు ఒక్కసారిగా మారిపోతాయి.. కానీ.. గెలుపు సాధించిన తర్వాత వినయం అవసరం. ఎందుకంటే వినయమే విజయం వైపు నడిపిస్తుంది. మాటలో, తీరులో అహంకారం - దర్పం ప్రదర్శించే వ్యక్తులకు వైఫల్యం తప్పదు. అదృష్టం కలిసొచ్చి వీరిని విజయం వరించినా అది శాశ్వతం కాదు... 


అజాగ్రత్త 
లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం ఏర్పాటు చేసుకుని ఆ మార్గంలో అడుగులు వేస్తున్నప్పుడు అజాగ్రత్త మీ దరిచేరకూడదు. గెలుపు దిశగా వేసే ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉండాలి..ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా అది మీ ప్రత్యర్థుల గెలుపుని సులభతరం చేస్తుంది. 


సమయపాలన
సమయపాలన, క్రమశిక్షణ లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదు, చేయాల్సిన పనిని వాయిదా వేయకూడదు. క్రమశిక్షణలో ముందుకు సాగినప్పుడు ఓ దశలో పరాజయం పలకరించినా ఆ తర్వాత విజయం తథ్యం...


Also Read: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!
 
బలహీనతే బలం 
మీ బలహీనత ఏంటో మీకు తెలిసినప్పుడు దానికి ఆజ్యం పోసేకన్నా బలంగా మార్చుకోండి. ఎందుకంటే భవిష్యత్ లో మరిన్ని సవాళ్ల ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇదే మీకు కొండంత అండ అవుతుంది.  ఆ తర్వాత అడుగడుగునా సవాళ్లు ఎదురైనా సులభంగా అధిగమించేస్తారు.


మంచి సహవాసం 
ఓ వ్యక్తిని ఓ మెట్టు ఎక్కించాలన్నా - పాతాళానికి తొక్కేయాలన్నా నిర్ణయించేది స్నేహం , సహవాసాలే. ఎందుకంటే మీ చుట్టూ ఉండేవారి ప్రభావం మీపై తప్పనిసరిగా ఉంటుంది. అందుకే మంచి వ్యక్తులతో సహవాసం చేసి..తప్పుడు వ్యక్తులను ముందుగానే గుర్తించి దూరంగా ఉంచడం మంచిది. 
 
మాటలో మాధుర్యం
బంధాలన పెంచాలన్నా తుంచాలన్నా మాటే ప్రధానం. ఆ మాటలో మాధుర్యం ఉన్నప్పుడే నలుగురి మధ్య మీ గౌరవం నిలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో ఆదరణ లభిస్తుంది


తప్పులు సరిదిద్దుకోండి 
తప్పులు చేయడం మానవ సహజం..ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేవారే ఏ రంగంలో అయినా విజయం సాధిస్తారు, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు. 


Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులకు విజయం - ఆ రాశి వారికి వెన్నుపోటు!