AP Election Counting News: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి హడావుడి నెలకొంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. నేడు (జూన్ 4) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా రావడం వల్ల.. వీటికి ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. 


ఇక ప్రతి కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగనుంది. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థులకు చెందిన ఏజెంట్లు ఉండనున్నారు. వారి ఎదుటే ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యను నమోదు చేయడం జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు వైన్ షాపులను కూడా పూర్తిగా మూసేశారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రత బలగాలను మోహరించారు.


రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సీట్ల కోసం 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించారు. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. 26,473 మంది ఓటర్లు  హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా ఓటు వేశారు. మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేయడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. 


ఈ నియోజకవర్గాల్లో ఫలితం చాలా ఆలస్యం
ఏపీ వ్యాప్తంగా అమలాపురం లోక్ సభ సీటు ఫలితం చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 27 రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి, ఫలితం తేలడానికి 9 గంటల సమయం పడుతుందని అంచనా. అలాగే రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభలో 13 రౌండ్లు ఉండగా... ఇక్కడ ఫలితం త్వరగా తేలనుంది. అంటే సుమారు 5 గంటలు పడుతుందని చెబుతున్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్లలో 26 రౌండ్లు ఉన్నాయి. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వచ్చేస్తాయని అధికారులు తెలిపారు.