Adilabad Election Counting News: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఫలితంపై పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈవీఎం యంత్రాల్లో భద్రంగా ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో ఓట్లు లెక్కింపుతో బహిర్గతం కానుంది. మంగళవారం జరగనున్న ఆదిలాబాద్ లోక్ సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం జిల్లా అధికారుల టీమ్ సర్వం సిద్ధం చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సెంటర్, పాలిటెక్నిక్ కళాశాల, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లలో జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.


ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం 
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గం చెందిన ఓట్ల లెక్కింపు టీటీడీసీలో జరగనుంది. ఇక నిర్మల్, ఖానాపూర్, ముధోల్, నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పాలిటెక్నిక్ కళాశాలలో, సిర్పూర్, అసిఫాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా టేబుల్లు ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. మే 13న పోలింగ్ జరగగా ఈసీ షెడ్యూల్ ప్రకారం మంగళవారం కౌంటింగ్ చేపడుతోంది.


ఓట్ల లెక్కింపు జరగనుండడంతో అభ్యర్థులతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో మొత్తం 16,50,176 ఓట్లకుగాను 12,21,663 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిని లెక్కించేందుకు ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 16 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. మిగితా ఆరు నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్ సభ పరిధిలో మొత్తం 157 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో 23 రౌండ్లు ఉండటంతో వీటిని లెక్కింపు పూర్తయిన తర్వాతే ఫలితాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు.


ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారులు
ఆదిలాబాద్ నియోజకవర్గంలో 21 రౌండ్లు, నిర్మల్, బోథ్ 22 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా, సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో మాత్రం 23 రౌండ్ల వరకు లెక్కించనున్నారు. లెక్కింపు కోసం ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక రోజు ముందుగానే ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఆ మూడు కేంద్రాల్లోనూ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసారు. ఏలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 


నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు.. రౌండ్ల వివరాలు ఇవి


నియోజకవర్గం - పోలైన ఓట్లు-  టేబుళ్లు -రౌండ్


సిర్పూర్        1,63,944      14      23
ఆసిఫాబాద్   1,71,511     16      23
బోథ్              1,65,157      14      22
ఆదిలాబాద్   1,81,136      14      21
ఖానాపూర్    1,62,101       14     23
నిర్మల్            1,85,168       14     22
ముధోల్         1,92,546       14     23