Group-1 Prelims Exam Instructions: తెలంగాణలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ (TGPSC) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్ మీద తప్పనిసరిగా పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాలని కమిషన్ అధికారులు తెలిపారు. అదికూడా 3 నెలలలోపు దిగిన ఫొటో (రీసెంట్ ఫొటోగ్రాఫ్) అయి ఉండాలని తెలిపారు. హాల్‌టికెట్ మీద ఫొటో అతికించకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌లోని నియమ నిబంధనలను క్షుణ్నంగా చదివి, తప్పనిసరిగా పాటించాలని కమిషన్ సూచించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలు, OMR షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
డిక్లరేషన్ ఇవ్వాల్సిందే...
గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ మీద ఫొటో, పేరు వివరాలు సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని (Declaration Form) పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారు. అదేవిధంగా హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాల్సి ఉంటుంది. ఫొటో లేని హాల్‌టికెట్లను పరిగణనలోకి తీసుకోరు. వారిని అనుమతించరు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిక్లరేషన్/అథంటికేషన్ (ఫామ్-1, ఫామ్-2)లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఫొటోను సరిగా అప్‌లోడ్ చేయలేకపోయిన అభ్యర్థులు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను డిక్లరేషన్ ఫామ్-1కు జతచేయాల్సి ఉంటుంది. అలాగే పేరు తప్పుగా ఉన్న అభ్యర్థులు తమ పదోతరగతి లేదా డిగ్రీ సర్టిఫికేట్‌లో ఉన్న విధంగా పూర్తి పేరును డిక్లరేషన్ ఫామ్-2లో నమోదుచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ లేదా అభ్యర్థులు చివరిగా చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపల్ ద్వారా అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు పాటించాల్సిందే..
➥ టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఫొటోఐడీ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ పరీక్ష హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాల్సి ఉంటుంది. ఫొటో లేని హాల్‌టికెట్లను పరిగణనలోకి తీసుకోరు. వారిని అనుమతించరు.
➥ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ మీద ఫొటో సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారు.
➥ హాల్‌టికెట్ మీద ఫొటో సరిగాలేని అభ్యర్థులు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లడం మంచింది.
➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్‌లోకి పంపిస్తారు. ఉదయం 10 గంటలకు గేట్లను మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమితించరు. ఉదయం 9.30 గంటల నుంచే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.
➥ పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డిజిటల్ వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, రైటింగ్ పాడ్, నోట్స్, చార్టులు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించరు.
➥ అభ్యర్థులు OMR పత్రంలో ఏమైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా మరొకటి ఇవ్వరు.
➥ అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని పరీక్షకు హాజరుకావాలి. షూ వంటివి ధరించకూడదు.
➥ బ్లాక్ లేదా నీలం రంగు పెన్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదు.
➥ ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి.
➥ సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన, వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్ చేసే పత్రాలు చెల్లుబాటు కావు.
➥ ఎవరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
గ్రూప్-1 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..