Chanakya Niti In Telugu : స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. ఆయ‌న‌కు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడ‌నే పేర్లు కూడా ఉన్నాయి. ఆయ‌న రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది.  అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ ఆర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు రాజనీతి, అర్థశాస్త్రాలను ఆకళింపు చేసుకున్నాడు. కేవలం రాజనీతి, అర్థశాస్త్రం గురించి మాత్రమే కాకుండా మాన‌వుడు స‌మాజంలో సంతోషంగా బతికేందుకు ఎన్నో విషయాలు బోధించాడు చాణక్యుడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఎలా దాటాలో కూడా సూచించాడు. జీవితంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలో చాణ‌క్యుడు చ‌క్క‌గా వివరించాడు. ఆర్థికంగా విజయం  సాధించడానికి చాణ‌క్య నీతి అనేక ఉపాయాలు బోధించింది. మీరు పేదరికం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకుంటే చాణక్యుడు చెప్పిన ఈ నియ‌మాల‌ను ఖచ్చితంగా పాటించండి. చాణక్య నీతి ప్రకారం.. మీరు ధనవంతులు కావాలనుకుంటే, ఎప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మీరు  చేసే చిన్న తప్పిదమే లక్ష్మీదేవి ఆగ్ర‌హానికి కారణమవుతుందని చాణక్యుడు చెప్పాడు. అవి ఏమిటో, ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ఎవ‌రిపై ఉంటుందో తెలుసుకోండి.


స‌మ‌యానికి, డ‌బ్బుకు విలువ‌


సమయానికి, డబ్బుకు విలువనిచ్చే వారికే విజయం దక్కుతుందని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యసాధనలో అజాగ్రత్తగా ఉండేవారు, అయిన దానికి, కాని దానికి దుబారా ఖర్చు చేసేవారిపై లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంద‌ని తెలిపాడు. అలాంటి అల‌వాట్లు ఉంటే వెంట‌నే మానుకోవాల‌ని అప్పుడే ల‌క్ష్మీ క‌టాక్షం సిద్ధిస్తుంద‌ని సూచించాడు.


ధ‌నాన్ని స‌క్ర‌మంగా వినియోగించాలి


డబ్బును సక్రమంగా వినియోగించాలి. అహంకారంతో, కోపంతో డబ్బును ఇష్టారీతిన‌ ఉపయోగించే వారి జీవితం దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌ని చాణ‌క్యుడు హెచ్చ‌రించాడు. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్ర‌హం ఎప్ప‌టికీ ఉండ‌ద‌ని స్ప‌ష్టంచేశాడు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు క‌నుక వాటిని మార్చుకోకుంటే జీవితంలో న‌ష్ట‌పోతార‌ని తెలిపాడు.


సంపాద‌న కోసం హాని క‌లిగించ‌కూడ‌దు


డబ్బు సంపాదించాలనే కోరికతో మనిషి ఇతరులకు హాని క‌లిగించ‌డం. కావ‌ల‌సిన‌ వారిని బాధపెట్టడం ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. సంపాద‌న కోసం తప్పుడు మార్గంలో, అనైతిక పనులు చేయడం ప్రారంభించినప్పుడు అలాంటి వ్య‌క్తిపై ల‌క్ష్మీదేవి కోపగించి అతన్ని విడిచిపెడుతుంద‌ని చాణ‌క్యుడు స్పష్టంచేశాడు.


సంప‌ద పెరిగినా గ‌ర్వం త‌గ‌దు


కొంద‌రు డ‌బ్బు లేనంత‌వ‌ర‌కు అణుకువ‌తో ఉండి, డబ్బు రాగానే అహంకారం పెంచుకుంటారు. అలాంతి వారిపై సంపద‌ల నిచ్చే మాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంద‌ని చాణక్యుడు తెలిపాడు. ఇలాంటి పొర‌పాటు చేసే వ్య‌క్తులు త్వ‌ర‌లోనే ద‌రిద్రాన్ని అనుభ‌విస్తార‌ని హెచ్చ‌రించాడు. ధ‌నం రాగానే మిడిసిప‌డితే ల‌క్ష్మీదేవి ధనవంతులను కూడా పేదలను చేస్తుంద‌ని, అందువ‌ల్ల అలాంటి పొర‌పాట్లు చేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికాడు.


శుభ్ర‌తే ల‌క్ష్మీ నివాసం


ప‌రిశుభ్ర‌త అంటే సిరుల త‌ల్లికి అత్యంత ప్రీతిక‌ర‌మ‌ని చాణ‌క్యుడు తెలిపాడు. ల‌క్ష్మీదేవి అప‌రిశుభ్ర‌మైన ప్ర‌దేశాల్లో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌ద‌ని, అలాంటి ప్రాంతాల‌ను వెంట‌నే వ‌ద‌లివెళుతుంద‌ని చెప్పాడు. ఎప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంటూ, శుచిగా ఉంటే ధ‌న‌ల‌క్ష్మి కృప సిద్ధిస్తుంద‌ని వెల్ల‌డించాడు. 


మ‌హిళ‌లు, పెద్ద‌ల‌ను పూజిస్తే ల‌క్ష్మీ క‌టాక్షం


స్త్రీలను అవమానించే ఇళ్లో, పెద్దలను గౌరవించని నివాసాల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. అలాంటి కుటుంబ సభ్యుల ప్రతిభ, సామర్థ్యం, ​​​​గౌరవం అన్నింటినీ ఆవిడ‌ నాశనం చేస్తుంద‌ని చాణ‌క్యుడు స్ప‌ష్టంచేశాడు. మ‌హిళ‌ల‌ను, పెద్ద‌ల‌ను ఎప్పుడూ గౌర‌విస్తూ చిన్న‌వారితో ప్రేమ‌గా మాట్లాడే వారు ఉండే ఇళ్ల‌లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకుంటుంద‌ని తెలిపాడు.


Also Read: మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, రోజూ ఉదయం ఈ 5 పనులు చేయండి, త‌ప్ప‌కుండా విజయం సాధిస్తారు