Chanakya Niti: మనకు తెలియకుండానే స్నేహితులు మన జీవితంలోకి వస్తారు, వెళ్లిపోతారు. మన స్నేహితులు కొందరు చివరి వరకు మనతోనే ఉంటారు, మరికొందరు తమ పని పూర్తయిన తర్వాత మన‌ల్ని విడిచి వెళ‌తారు. చాలా మంది స్నేహితులు ఉండవలసిన అవసరం లేదు. ఒక్క మంచి స్నేహితుడు కూడా వెయ్యి మంది స్నేహితులతో స‌మానం. మన జీవితం బాగుపడాలంటే స‌రైన‌ స్నేహితుడి సాంగత్యం ఎంత అవ‌స‌ర‌మో.. అదే విధంగా మన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక‌ చెడ్డ స్నేహితుడు సరిపోతాడని చాణక్యుడు చెప్పాడు.


మనకు తెలియకుండానే కొన్నిసార్లు స్నేహం చేస్తాం. వారు పైకి మాత్రమే అందంగా కనిపించవచ్చు లేదా వారు మంచి లక్షణాలతో స్నేహితులు కావచ్చు. ఇంతకీ మంచి స్నేహితుడు ఎవరు..? చెడ్డ స్నేహితుడు ఎవరో తెలుసుకోవడం ఎలా..? ఏ లక్షణాలు మనిషిని మంచి, చెడు స్నేహితుడిగా మారుస్తాయి..?


1. మంచి స్నేహితుడి లక్షణాలు
మనం ఎవరినైనా స్నేహితుడిగా ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఎంపిక చేసుకోవడం మంచిది. మనకు చాలా మంది స్నేహితులు ఉండవచ్చు. అయితే కష్టకాలంలో మనతో పాటు ఉండి మన కష్టాలను తన కష్టాలుగా భావించి ఆపన్న హస్తం అందించేవాడే నిజమైన మిత్రుడని ఆచార్య చాణక్యుడు స్ప‌ష్టంచేశాడు. స్వార్థం కోసం స్నేహం చేసే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. చాణక్యుడు స్వార్థపరుల స్నేహాన్ని కోరుకునే బదులు, మీ కష్టాలలో మిమ్మల్ని మీరు న‌మ్ముకోవ‌డం మంచిదని చెప్పాడు. ఒక మంచి స్నేహితుడు మన సుఖ‌దుఃఖాలు రెండింటిలోనూ సమానంగా పాల్గొనాలని గుర్తుంచుకోండి.


Also Read : ఈ 5 నియ‌మాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎప్ప‌టికీ మీ ద‌రిదాపుల‌కి రావు!


2. మనం తప్పు చేస్తే చెప్పగలగాలి
ఆచార్య చాణక్యుడి ప్రకారం, మన ముందు తీయగా మాట్లాడే, మంచిగా ​​ప్రవర్తించే వ్యక్తులతో స్నేహం చేయడం కంటే.., మన తప్పులను ఎత్తి చూపే వారితో స్నేహం చేయాలి. తీపి పదార్ధాలలో తప్ప ఉప్పులో పురుగులు ఎప్పుడూ అభివృద్ధి చెందవు. ఉప్పు మురికిని, పురుగులను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మన తప్పులను గుర్తించే స్నేహితులతో మనం సహవాసం చేయాలి. మ‌నం స‌రైన ప‌ని చేసిన‌ప్పుడు వెన్ను తట్టేవాడే మంచి స్నేహితుడు. మనం తప్పు చేసిన‌ప్పుడు హెచ్చిరించ‌కుండా ప్రోత్సహించి, మన వెనుక ఆడుకునే వారితో ఎప్పుడూ సహవాసం చేయకూడదని గుర్తుంచుకోండి.


3. స్నేహానికి ముందే గుర్తించండి
మనం ఏ వ్యక్తితోనైనా సహవాసం చేస్తున్నప్పుడు, స్నేహితులుగా ఎంపిక చేసుకునేటప్పుడు, ముందుగా వారి ప్రవర్తన, మాట, ప్రవర్తన సరిగా చూసుకోవాలి. ఇతరుల గురించి మనతో ఎలా మాట్లాడతారో, ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తారో మనం గమనించాలి. ఎందుకంటే, ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి భవిష్యత్తులో మీ గురించి చెడుగా మాట్లాడవచ్చు. ఉదాహరణకు మనం వేపచెట్టుకు ఎంత తియ్యటి పాలను పోసినా వేపచెట్టు తీరు మార‌దు, వేప చేదు తీపిగా మారదు. అలాంటిదే చెడు స్నేహితుల సాంగ‌త్యం కూడా. వారికి ఎంత మేలు చేసినా, వారి కష్టాల్లో ఎంత సానుభూతి చూపినా, వారి అసలు గుణం మారదు.


ఆచార్య చాణక్యుడు ప్రకారం, మనం ఏ వ్యక్తితోనైనా సహవాసం చేసే ముందు లేదా ఒక వ్యక్తిని స్నేహితుడిగా ఎంచుకునే ముందు, అతని గురించి పైన పేర్కొన్న 3 అంశాలను గుర్తుంచుకోవడం మంచిది.


Also Read: ఇలాంటి పరిస్థితుల్లో వెంట‌నే పారిపోవాలి


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.