Surya Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటాడో ఇతర గ్రహాల ప్రతికూల ఫలితం అంతగా హాని కలిగించని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. కర్కాటక రాశిలో సంచరిస్తున్న సూర్యుడు  ఆగష్టు 17న తన సొంత రాశి అయిన సింహంలో సంచరిస్తాడు. మళ్లీ సెప్టెంబరు 17 వరకూ అదే రాశిలో ఉంటాడు. ఆదిత్యుడు తన సొంత రాశిలోకి వెళ్లడం వల్ల ఇంకొంత శక్తివంతుడు అవుతాడు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూల ప్రభావం, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి మాత్రం సింహరాశిలో సూర్యసంచారం వల్ల రాజయోగమే అనిచెప్పాలి. ఆ మూడు రాశులేంటో చూద్దాం..


Also Read: వివాహానికి అనుకూలమైన రాశులివే!


మేష రాశి


సింహ రాశిలో సూర్య సంచారం అంటే మీ రాశి నుంచి ఐదో స్థానంలో అని అర్థం. ఈ ఫలితంగా ఇల్లు, విద్య, ప్రేమ, పిల్లలు, తెలివితేటలు, ఉద్యోగం ఇలా అన్నివిషయాల్లో మీకు అనుకూల ఫలితాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు, నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అద్భుతమైన ఫలితాలున్నాయి. స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ కి సంబంధించిన నిర్ణయాల్లో లాభం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. మీ వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. 


వృశ్చిక రాశి


వృశ్చిక రాశికి సూర్యుడు 10వ స్థానంలో సంచరించినప్పుడు మీ కెరీర్ ఊహించని మలుపు తిరుగుతుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే అనువైన సమయం. వ్యాపారులు కూడా లాభపడతారు. టెండర్లకు సంబంధించి ప్రయత్నాలు చేసేవారు సక్సెస్ అవుతారు. రాజకీయ నాయకులకు, పరిపాలనా అధికారులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. 


ALso Read: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!


మీన రాశి


సింహ రాశిలో సూర్య సంచారం అంటే మీన రాశి నుంచి ఆరో ఇంట్లో. ఈ సమయంలో ఈ రాశివారికి రాజయోగమే అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ సమయంలో ఉద్యోగులు ఊహించని ప్రయోజనం పొందుతారు. వేరొకరు వెళ్లిపోవడం మీ అదృష్టానికి నాంది పలుకుతుంది. సూర్యుడిని మిత్రుడు అని పిలుస్తారు..శత్రువులను నాశనం చేసి స్నేహితులను పెంచుతాడు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 17 వరకూ సింహ రాశిలో సూర్య సంచారం ఉన్నన్ని రోజులు శత్రువులపై మీదే పైచేయి, తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు  సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. దీర్ఘకాలిన అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. 


సూర్యుడు గౌరవం, ఆత్మగౌరవం, వృత్తి, రాజకీయాలు, ఉన్నత పదవి, ఉద్యోగానికి కారకుడు. జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే మీరు ఈ రంగాల్లో విజయం సాధిస్తారు. ఇంకా సాత్విక భావాలు, నిజాయితీ, నాయకత్వ సామర్థ్యానికి కూడా సూర్యుడు కారకుడు.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.