Nirjala Ekadashi 2025: సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలుంటాయి. వాటిలో జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. నిర్జల ఏకాదశి వ్రతం చాలా కఠినమైనది. 

ఏకాదశి రోజు బియ్యంతో వండిన పదార్థాలు తినకూడదు అని చెబతారు. మరి ఈ రోజు తలస్నానం చేయొచ్చా? దీనికి సరైన సమాధానం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.  

నిర్జల ఏకాదశి రోజున తలస్నానం చేయాలా వద్దా?

తరచుగా ఉపవాసం చేసేవారు శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి తలస్నానం కూడా చేస్తారు. అయితే కొన్ని ఉపవాసాలలో ఇది అవసరం, కానీ నిర్జల ఏకాదశి వ్రతం రోజున తలస్నానం చేసే తప్పు చేయవద్దంటారు పండితులు. ఇలా చేయడం మంచిది కాదు. వ్రతం చేసే వారితో పాటు, ఈ వ్రతం చేయని వారు కూడా తలస్నానం చేయకూడదు. ఏకాదశి రోజున తలస్నానం చేస్తే సుఖసంతోషాలు దూరం అవుతాయని నమ్ముతారు. పేదరికం ఇంట్లో ప్రవేశిస్తుంది. వ్రతం ప్రారంభించే ముందు రోజున, దశమి తిథి నాడు తలస్నానం చేయండి. ఇక్కడ తలస్నానం అంటే తలరుద్దుకోవడం అని అర్థం. షాంపూ, కుంకుడుకాయ ఇలాంటివి ఏమీ వినియోగించకుండా కేవలం నదీ స్నానం చేసినప్పుడు నీటిలో ఎలా తలకు స్నానం చేస్తామో అలా చేయాలి. మర్నాడు ద్వాదశి రోజు కూడా తల రుద్దుకోకూడదు. సాధారణం తలస్నానం చేసి పూజ పూర్తిచేయాలి. దాన ధర్మాలు చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి.

ఏకాదశి రోజున ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

ఏకాదశి వ్రతం చేసేవారు మంచంపై నిద్రపోరాదు..నేలపైనే నిద్రించాలి

బ్రహ్మచర్యం పాటించాలి

ఎలాంటి కఠిన పదాలు మాట్లాడకూడదు, ఎవర్నీ దూషించరాదు

ఈ రోజు చిన్న జీవికి కూడా హాని తలపెట్టని విధంగా మీ ప్రవర్తన ఉండాలి

ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు దశమి రోజు రాత్రి నుంచి నియమాలు పాటించడం మొదలు పెట్టాలి

నిర్జల ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఆచరించేవారు నీటిని కూడా ముట్టుకోకూడదు

ఉపవాసం చేసేవారు సాధారణంగా ఏకాదశి రోజు సాయంత్రం అయ్యేసరికి పూజ పూర్తిచేసి అల్పాహారం తీసుకుంటారు..కానీ ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు సాయంత్రం పూజ పూర్తైన తర్వాత పండ్లు, స్వామికి నివేదించిన ప్రసాదం మాత్రమే స్వీకరించాలి. ఈరోజు మీరు తీసుకునే అల్పాహారం, స్వామికి సమర్పించే ప్రసాదంలో ఉప్పు, కారం తగలకూడదు

ఏకాదశి ఉపవాసం విమరించేవారు ద్వాదశి ఘడియలు దాటిపోకుండా ఉపవాసం విడిచిపెట్టాలి. రోజంతా ద్వాదశి ఘడియలు ఉంటే పర్వాలేదు. కానీ ఒక్కోసారి ఉదయానికే ద్వాదశి ఘడియలు పూర్తవుతాయి. అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణవుని ప్రార్థించి ఓ గ్లాసు నీళ్లు తాగి ఉపవాసం  విరమించాలి. అనంతరం వంట చేసి స్వామికి నివేదించి భోజనం చేయాలి

దశమి రోజు ఒకపూట భోజనం చేసి..ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి..ద్వాదశి రోజు కూడా ఒక పూట మాత్రమే భోజనం చేయాలి

 శ్రీ మహా విష్ణువు శ్లోకాలు

భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరమ్ అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే  సుహృదం సర్వభూతానాం సర్వలక్షణసంయుతమ్ అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే  చిదచిత్సర్వజంతూనాం ఆధారం వరదం పరమ్ అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే  శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్  అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకునే ముందు  మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.