Brahma Muhurta: చాలా మంది తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా మేల్కొంటారు. మీకు ప్రతిరోజూ ఇలాగే జరిగితే, దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోండి. మీరు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య అకస్మాత్తుగా నిద్రలేచినట్లయితే అది దైవిక శక్తికి సంకేతంగా చెబుతారు. ఏదో దైవిక శక్తి మీకు ఒక సందేశాన్ని తెలియజేయాలని, మీకు ఏదైనా వివరించాలని కోరుకుంటోందని ఇది సూచిస్తుంది. మీరు ప్రతిరోజూ తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొంటున్న‌ట్ల‌యిటే.. సృష్టి, దైవిక శక్తి మిమ్మ‌ల్ని మేల్కొలిపి, మీ ఇష్టదైవాన్నిఆరాధించమని సందేశాన్ని అందిస్తున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.


తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:30 గంటల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు. దీనినే బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. మీరు ప్రతిరోజూ ఈ సమయంలో అకస్మాత్తుగా మేల్కొంటే, మిమ్మ‌ల్ని ఈ సమయంలో మేల్కొలపాలని దైవిక శక్తి కోరుకుంటోందని అర్థం. అటువంటి పరిస్థితిలో, మీరు కొంత సమయం పాటు మీ ఇష్ట దైవాన్ని పూజించాలి. ఈ సమయంలో మీరు చేసే పూజలు నేరుగా భగవంతుడిని చేరుకుంటాయి.


బ్రహ్మ ముహూర్తం లేదా అమృత సమయం అంటే?
బ్రహ్మ ముహూర్తం రాత్రి చివరి ఘ‌డియ‌ మూడవ భాగం. వైదిక‌ గ్రంధాల ప్రకారం నిద్ర నుంచి మేల్కొన‌డానికి ఇదే సరైన సమయం. బ్రహ్మ అంటే అంతిమ అంశం. ముహూర్తం అంటే శుభ సమయం. బ్రహ్మ ముహూర్తాన్ని అమృత స‌మ‌యం అని కూడా అంటారు. అమృత అంటే జీవునికి అమరత్వాన్ని ప్రసాదించడం. అంటే అమరత్వాన్ని ప్రసాదించే సమయం.


Also Read : కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయణం, దీని విశిష్టత మీకు తెలుసా?


అమృత స‌మ‌యంలో భగవంతుడే తన భక్తులకు అమృతాన్ని ఇచ్చేందుకు వచ్చే సమయం అని, ఆ అమృతాన్ని సేవించనివాడు సుఖాన్ని పొందలేడని నమ్మకం. అమృత సమయంలో సానుకూల ప్రకంపనలు ఆకాశంలో చాలా వేగంగా ప్రవహిస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో ప్రతికూల ప్రకంపనలు సుషుప్తి అవ‌స్థ‌లో ఉంటాయి, సానుకూల ప్ర‌కంప‌న‌లు చైత‌న్యంగా ఉంటాయి.


తెల్లవారుజామున స‌రైన‌దేనా?
తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తపు సమయంగా పేర్కొంటారు. ఈ స‌మ‌యంలో మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు. లేదా ఈ సమయంలో మీరు భ‌గ‌వంతునితో అనుసంధానం కావ‌చ్చు. మీ మ‌న‌సులోని ఆలోచనలను మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచించవచ్చు. అయితే ఈ సమయంలో నిద్ర లేవడం తప్పని కొందరు పేర్కొంటారు. అయితే అది స‌రికాద‌ని పెద్ద‌లు చెబుతారు.


సానుకూల ప్రకంపనలు
బ్రహ్మ ముహూర్తంలో సానుకూల శక్తుల ప్రకంపనలు అంటే భగవంతుని దివ్య శక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఆ సమయంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఈ కారణంగా మీరు బ్రహ్మ ముహూర్తానికి లేచి భగవంతుని నామస్మరణ చేసి, ధ్యానంలో నిమగ్నమవ్వాలి.


సానుకూల శక్తులు అంటే?
ఈ శక్తులు సానుకూల ప్రకంపనలతో నిండి ఉన్నాయి, ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తాయి, సంపదతో నింపుతాయి, మీ భక్తిని పెంచుతాయి. మీరు ఉదయాన్నే లేచి పూజలు చేస్తే, మీ శరీరంలో అనేక శక్తులు స్థిరపడతాయి. ఈ సంకేతాలన్నీ దైవిక శక్తి ద్వారా చేర‌తాయి.


పూజ‌కు స‌రైన స‌మ‌యం
దేవుడు తన ప్రియమైన భక్తులను బ్ర‌హ్మ ముహూర్తంలోనే మేల్కొల్పుతాడు. రాత్రంతా నిద్రపోకుండా, తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోయే కొంతమందిని మీరు చూస్తారు. అయితే, ఈ సమయంలో మీరు నిద్రలేచినట్లయితే, తిరిగి నిద్రపోకండి. ఆ సమయంలో భగవంతుడిని ఆరాధిస్తూ, మ‌న‌స్సు ఆయ‌న‌పై నిమగ్నం చేయండి.


Also Read : ఆగష్టు 17 నుంచి నిజ శ్రావణం, మొదటి 15 రోజుల్లో వచ్చే పండుగలివే!


బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాలు
బ్రహ్మ ముహూర్త సమయంలో దైవిక శక్తి, ధ్యానం, పూజలపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తపు నియమాలు, నిబంధనల ప్రకారం తమ జీవితాలను గడిపిన వారు ఎల్లప్పుడూ దైవిక అనుగ్రహం  పొందుతార‌ని విశ్వ‌సిస్తారు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయడం వల్ల దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది. తెల్లవారుజామున భ‌గ‌వంతుడు విశ్వంలో తిరుగుతాడని నమ్ముతారు. బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం అంతా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలోనే దేవదూతలు సంచ‌రిస్తుంటారు. సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువ. ప్రధాన ఆలయాల తలుపులు కూడా బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే తెరుచుకుంటాయి. బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే దేవుడిని పూజించే సంప్రదాయం ఉంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.