Vijayawada News : విజయవాడ దుర్గమ్మ వారి ఆలయంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. అమ్మవారి నివేదన తయారు చేసే గదిలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటం పై ఈవో సీరియస్ అయ్యారు. ఈమేరకు వైదిక కమిటిలోని అర్చకులకు ఆమె నోటీసులు ఇచ్చారు. వైదిక కమిటిలోని అర్చకులు చేసిన పని పై విచారణ చేపట్టారు. అమ్మవారికి అత్యంత నిష్టతో ప్రసాదం తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా వ్యవస్ద కూడ ఉంటుంది. నిబందనలు ప్రకారం గుర్తింపు పొందిన అర్చకులు, వైదిక కమిటిలోని సభ్యులు మాత్రమే అమ్మవారికి నివేదన తయారు చేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా వంట శాల ఉంటుంది. అయితే అమ్మవారి నివేదన తయారు చేసే వంట శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహరం ఈవో వద్దకు చేరింది.
సీసీ కెమెరా దృశ్యాలు సేకరించిన అధికారులు
దీని పై విచారణ చేపట్టిన అధికారులు ఈవో కు నివేదిక ఇచ్చారు. నివేదక ప్రకారం ఈవో వైదిక కమిటిలో ఉన్న అర్చకులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు పై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ తీసుకున్న తరువాత చర్యలు ఉంటాయని అంటున్నారు. మరో వైపున విషయం బయటకు రావటంతో రాత్రికి రాత్రే నివేదన శాలలో సంప్రోక్షణలు చేసినట్లుగా చెబుతున్నారు. దీని పై దేవస్దానంలో ఉన్న సీసీ కెమేరాల వీడియోలు ఈవో సేకరించారని, వాటిని బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నివేదన వంటశాళలోకి అర్చకుకూ ప్రవేశం ఉండదు.. ప్రైవేటు వ్యక్తులెలా వెళ్లారు ?
ఇంద్రకీలాద్రి పై అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన తయారు చేసేందుకు స్పెషల్ వంటశాల ఉంటుంది. అమ్మవారి నివేదన శాల లో వంటకాలు చేసేందుకు బ్రాహ్మణ అర్చకులు తెల్లవారు జాము నుండే కార్యకలాపాలు సాగిస్తుంటారు. రోజుకు మూడు పూటలా అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నివేదనగా సమర్పిస్తుంటారు. ఇందుకు గాను ప్రత్యేక కమిటీ కూడ ఉంటుంది. వైదిక కమిటిలో ని అర్చకులు నివేదన సమర్ఫణ కు కావాల్సిన కార్యకలాపాలను పరిశీలిస్తుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన నివేదన శాలలోకి ఇతరులను అనుమతించరు. దేవస్దానంలో పని చేసే సిబ్బంది, అర్చకులు కూడ నివేదన శాలలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. అంతే కాదు అర్చకులు నివేదన శాలలోకి రావాలన్నా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలోకి వేరొక వ్యక్తిని తీసుకురావటం సంచలనం రేకెత్తించింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో సదరు అర్చక స్వాములకు ఈవో సంజాయిషీ నోటీసులు ఇచ్చారని అంటున్నారు.
వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు
ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్దానంలో సిబ్బంది మధ్య వర్గ విభేదాల కారణంగా జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఘటన పై అధికారులు ముందస్తుగా సీసీ కెమేరాల వీడియోలను సేకరించినట్లుగా చెబుతున్నారు. నివేదన శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు రావటం, అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకోవటం, అక్కడే తిని చేతులు కడుక్కోవటం వంటి వీడియోలు సైతం రికార్డయ్యాయని అంటున్నారు. అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశంలో ఇలా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి, ఇష్టాను సారంగా వ్యవహరించటం వలన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెబుతున్నారు. వ్యవహరం బయటకు రావటంతో ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించారని, అంతా జరిగిన తరువాత ఇప్పుడు దిద్దు బాటు చర్యలు చేపట్టటం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.