Bhagavad Gita: హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు తగిన సమాధానంతో పాటు మార్గదర్శనం చేస్తుంది. జ్ఞాన భాండాగారమైన ఈ గ్రంథం వేలాది సంవత్సరాలుగా మన సంస్కృతిలో భాగంగా ఉంది.  మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాలు భగవద్గీతలో ఉన్నాయి. యుద్ధ భూమిలో అర్జునుడు నిస్సహాయుడైన‌ప్పుడు, యుద్ధాన్ని కొనసాగించడానికి కావ‌ల‌సిన‌ విశ్వాసం శ్రీ‌కృష్ణుడు ఇస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా నమ్మకాన్ని కలిగించాడో తెలుసా..?


ఆత్మపరిశీలన
అశాశ్వతానికి వాస్తవం లేదు. వాస్తవికత ఎప్పుడూ శాశ్వతం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గ్రహించినవాడు సంపూర్ణ‌ జ్ఞానం పొందుతాడు. ఈ నశించని లేదా మార్పులేని జ్ఞానంపై ఏ శక్తి తన ప్రభావాన్ని చూపదు. శరీరం నశించేది కావచ్చు కానీ శరీరంలో నివసించే ఆత్మ, జ్ఞానం అన్నీ అజరామరమైన చెరగని ఆస్తి. అందుకే.. సర్వస్వం పోగొట్టుకున్నా పర్వాలేదు, యుద్ధంలో పోరాడాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు.


Also Read : వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది- భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు!


మీకు మీరే యజమాని
మంచి యోధుడికి యుద్ధంలో శత్రువును ఓడించడం కంటే మరో ల‌క్ష్యం లేదు. అటువంటి యుద్ధాన్ని ఎదుర్కొన్న యోధుడు తనను తాను సంతోషపెట్టాలి. ఎందుకంటే అది అతనికి స్వర్గ ద్వారం లాంటిది. మీరు ఈ యుద్ధంలో పాల్గొనకపోతే, అది మీ ధ‌ర్మం, గౌరవానికి భంగం కలిగిస్తుంది. మీరు దాని పాపాన్ని అనుభవిస్తారు. ప్రాపంచిక బాధ్యతలు అన్ని ఇతర భావాలు, కోరికల నుంచి ఎలా భిన్నంగా ఉంటాయో భ‌గ‌వ‌ద్గీత మీకు బోధిస్తుంది. ఒకసారి మీరు ప్రాధాన్యాల‌ను నిర్దేశించుకుని, తదనుగుణంగా పని చేస్తే మాత్రమే మీరు ఆత్మగౌరవంతో ఆ పనిలో విజయం సాధిస్తారు.


మీ చర్యలపై అవ‌గాహ‌న‌
మీకు పని చేసే హక్కు ఉంది, కానీ ఆ పని ఫలాలను కోరుకునే హక్కు ఎప్పుడూ లేదు. ప్రతిఫలం కోసం మీరు ఎప్పుడూ పని చేయకూడదు. ఈ సందర్భంలో ఓటమిని విజయంగా పరిగణించాలి. మీరు భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని గ్రహించడం ప్రారంభించినప్పుడు, మీరు విషయాల అంతర్లీన విలువను మాత్రమే గ్రహించడంతో పాటు.. మీ ప్రయత్నాల విలువను ఏదైనా ఫలితాన్ని ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలను కూడా తెలుసుకుంటారు. ఫలితంగా, మీరు ఫ‌లితాల‌పై కాకుండా మీ చర్యలపై ఎక్కువ దృష్టి పెడతారు.


అనుభవం
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు.. అర్జునా.. "ఇప్పుడు నీతి సూత్రాలు విను. వీటిని ఆచరించడం ద్వారా నీవు కర్మ బంధాలను తెంచుకోవచ్చు. మనం పడే శ్రమ ఎప్పుడూ వృధా కాదు, అపజయాన్ని తెచ్చిపెట్టదు. ఆధ్యాత్మిక అవగాహన కోసం చేసే ఒక చిన్న ప్రయత్నం కూడా గొప్ప భయం నుంచి కాపాడుతుంది. ప్రాపంచిక పరిస్థితుల గురించి తెలుసుకుంటూనే, మనం రోజువారీ జీవితంలో ప్రతి సంఘటన నుంచి అనుభవాన్ని పొందాలి. ఇది ఈ రోజే కాదు భ‌విష్య‌త్‌లోనూ మీకు ఉపయోగపడుతుంది."


Also Read : సక్సెస్ ఫుల్ పర్సన్ కావాలంటే మీలో ఏ ల‌క్ష‌ణాలు ఉండాలో తెలుసా?


ధ్యానం చేయండి
ప్రతిరోజూ కొంత సమయం పాటు ధ్యానం చేయడం ద్వారా, మీరు దుఃఖం వ‌చ్చినా ఆందోళన చెందరు లేదా ఆనందం కోసం ఆరాటపడరు. అటువంటి వారు కామ‌ము, క్రోధము, మోహము, మ‌త్స‌రాల‌ నుంచి విముక్తులవుతారు. మీరు ధ్యానం ద్వారా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు. కఠినమైన పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయవు. స్వార్థ భావన మీ నుంచి తొలగిపోతుంది, మీ జీవితం అదృష్టం మీద ఆధారపడి ఉండదు. ధ్యానానికి అంకితమైన వారు ఏదో ఒకరోజు దార్శనికులవుతారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.