Bathukamma Nimajjanam:  "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో"అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు కలిసిమెలిసి ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో,జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో వచ్చే ఈ బతుకమ్మ పండుగ...భూమితో,జలంతో మనుషుల అనుబంధాన్ని గుర్తుచేస్తుంది.ఈ సంబరాలు జరుపుకున్న రోజులూ రోజుకో బతుకమ్మని ఆరాధించి..ఆఖరి రోజు అంటే సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేస్తారు.


బతుకమ్మని ఎందుకు నిమజ్జనం చేయాలి
బతుకమ్మ పేర్చేందుకు ఉపయోగించే పూలలో ఔషధ గుణాలు ఇమిడి ఉంటాయి.  9 రోజుల పాటు 9 రకాల పూలను సేకరించి.. అందంగా పేర్చుతారు. వీటిలో తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ , నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు. సద్దుల బతుకమ్మ రోజు పూజ, ఆటపాటల అనంతరం నిమజ్జనం చేస్తారు. ఈ పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల నీరు శుద్ధి అవుతుంది. 


Also Read:  బతుకమ్మని పూలతోనే ఎందుకు పేరుస్తారు, తప్పనిసరిగా వినియోగించాల్సిన పూలు ఏవి!
ఏ పూలలో ఎలాంటి ఔషధ గుణాలు



  • తంగేడు పూలలో సూక్ష్మక్రిములను చంపే గుణం ఎక్కువగా ఉంటుంది. చెరువులలో నీరు శుద్ధి కావడానికి  ఎంతగానో ఉపయోగపడుతుంది.

  • గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది

  • సీత జడ పువ్వులైతే జలుబు, ఆస్తమాను దూరం చేస్తాయి

  • మందారపువ్వు చుండ్రు రాకుండా నిరోధిస్తుంది

  • కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి

  • గుమ్మడి పువ్వులో విటమిన్ఏ పుష్కలంగా ఉంటుంది


ఇలా బతుకమ్మలో వినియోగించే పూలన్నింటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటన్నింటినీ నిమజ్జనం చేయడం వల్ల చెరువుల్లో నీరు శుద్ధి అయి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది, నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.


Also Read: ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ప్రకృతిని ఆటపాటలతో పూజించే 'బతుకమ్మ' వెనుక ఎన్ని కథలో!
వర్షాకాలం పూర్తై శీతాకాలం ఆరంభంలో వచ్చే పండుగ ఇది. ఈ సమయంలో చెరువులన్నీ నిండుకుండల్లా ఉంటాయి. ఎటుచూసినా పచ్చదనం పలకరిస్తుంది. గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే అవి ఇవి అనే వ్యత్యాసం లేకుండా గడ్డి పూల నుంచి గులాబీలవరకూ అన్నీ సేకరించి ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుతూ పూజిస్తారు. అనంతరం వాటిని నిమజ్జనం చేస్తారు.


తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ సెప్టెంబరు 25న ప్రారంభం కానుంది. అక్టోబరు 3 సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మని అధికారికంగా నిర్వహిస్తోంది.