Amaranth Yatra : అమర్ నాథ్ యాత్రపై కీలక ప్రకటన వెలువడింది. జూన్‌ 30 నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు తెలిపింది. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు సమావేశం ఆదివారం జరిగింది. ఈ యాత్రకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. అమర్‌నాథ్‌ యాత్రను ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభించి, రక్షాబంధన్‌ రోజుతో ముగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 43 రోజుల పాటు అమర్ నాథ్ మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అయితే కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 






43 రోజుల పాటు యాత్ర 


జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం చేసిన ట్వీట్‌లో “ఈరోజు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశానికి గవర్నర్ అధ్యక్షత వహించారు. 43 రోజుల పవిత్ర యాత్ర జూన్ 30న అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లతో ప్రారంభమవుతుంది. సంప్రదాయం ప్రకారం రక్షా బంధన్ రోజున యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రపై వివిధ అంశాలపై లోతుగా చర్చించాం." అని పేర్కొంది. దేశంలోని COVID-19 పరిస్థితి కారణంగా గత ఏడాది అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. గత ఏడాది జూన్ 21న అమర్ నాథ్ యాత్రను నిలిపివేయాలని జుమ్ము కశ్మీర్ గవవర్న్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణంగా భక్తులు లేకుండానే సంప్రదాయం ప్రకారం అమర్ నాథ్ మంచులింగానికి పూజా కైంకర్యాలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. 


మంచులింగం దర్శనానికి ప్రతీ ఏడాది లక్షల మంది


అమర్ నాథ్ మంచు లింగాన్ని ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు దర్శించుకుంచారు. వేసవి మాసంలో దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌ నాథ్‌ పుణ్యక్షేత్రానికి ప్రమాదకరమైన పర్వతాల నుంచి ట్రెక్కింగ్ చేస్తూ భక్తులు వస్తుంటారు. 2000లో జమ్ము కశ్మీర్ శాసనసభ చేసిన చట్టం ప్రకారం అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు (SASB) ఏర్పడింది. జమ్ము కశ్మీర్ గవర్నర్‌ అమర్ నాథ్ బోర్డుకు ఎక్స్-అఫీషియో ఛైర్మన్‌గా ఉంటారు.