Sattenapalli TDP : గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ(TDP)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. ఈనెల 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ(TDP Formation Day) ఏర్పాట్ల విషయంలో వివాదం చెలరేగింది. వైవీ ఆంజనేయులు(YV Anjaneeyulu) వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కోడెల శివరాం(Kodela Shivaram) వర్గం తీసేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
40 వసంతాలు టీడీపీ
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. పార్టీ 40 వసంతాల ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) ఆవిష్కరించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ లోగో(Logo)ను ఆవిష్కించారు. చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించిందన్నారు.
గ్రామ గ్రామాన వేడుకలు
టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మార్చి 29న ప్రతీ గ్రామంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ప్రాంతాన్ని సందర్శిస్తామని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలకు పొలిట్ బ్యూరో సభ్యులు హాజరవుతారని చంద్రబాబు చెప్పారు.