Akshaya Tritiya 2024 Unique Events in Temples:  ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు అక్షయతృతీయ. ఎలాంటి ముహూర్తాలతో సంబంధం లేకుండా రోజు మొత్తం అమృత ఘడియల కిందే పరిగణిస్తారు. సాధారణంగా  ఏదైనా కొత్త పని మొదలుపెడితే తిథి, వారం, నక్షత్రం చూసుకుంటారు..కానీ అక్షయ తృతీయ రోజు అవేమీ చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ప్రతి క్షణం శుభముహూర్తమే....ఏపని ప్రారంభించినా జయమే. అయితే ఇదే రోజు కొన్ని ఆలయాలకు ప్రత్యేకం. పైగా అవన్నీ ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రాలు కావడం మరింత విశేషం..


Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
  
చార్ ధామ్ యాత్ర ప్రారంభం


చార్ ధామ్ క్షేత్రాలను దీపావళి నుంచి 6 నెలల పాటూ మూసివేసి మళ్లీ అక్షయ తృతీయకు సమీపంలో  తెరుస్తారు. మూసి ఉన్న 6 నెలల కాలంలో దేవతలంతా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని నమ్మకం. అది నిజమే అని నిరూపిస్తూ ఆలయం మూసివేసినప్పుడున్న దీపం తిరిగి ఆరు నెలల తర్వాత తెరిచినప్పుడు కూడా అలాగే ఉంటుంది. గంగోత్రి, యమునోత్రిని అక్షయతృతీయ రోజే తెరుస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల విరామంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయి.  


Also Read: మాహిష్మతి రాజ్యాన్ని జయించిన మహావీరుడి జయంతి అక్షయ తృతీయ రోజే!


జగన్నాథుడి రథ నిర్మాణం ప్రారంభం


ఆషాడమాసం రాగానే పూరీ జగన్నాథుడి రథాయాత్ర సందడి మొదలవుతుంది. అయితే ఆ రథాన్ని తయారుచేయడం ఏటా అక్షయ తృతీయ రోజు ప్రారంభిస్తారు. నిర్మాణానికి వినియోగించే దుంగలు తీసుకొచ్చి ప్రత్యేక పూజ చేసి రథ నిర్మాణం ఆరంభిస్తారు. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టిన రథనిర్మాణం ఆషాడం వచ్చేసరికి పూర్తవుతుంది..


సింహాద్రి అప్పన్న నిజరూపం


ఏడాది మొత్తం లింగరూపంలో నిండుగా చందనంతో కప్పి ఉండే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రం నిజరూపంలో దర్శనమిస్తాడు. ఏడాదికోసారి కనిపించే ఈ దర్శనం కోసం భక్తులు పోటీపడతారు. వరాహం రూపం, మనిషి శరీరం, రెండు చేతులు పైకి కనిపిస్తాయి..కాళ్లు మాత్రం భూమిలో కూరుకుపోయినట్టు ఉంటాయి. ఈ నిజరూపం అక్షయతృతీయ ముందు రోజు అర్థరాత్రికి స్వామిపై ఉన్న చందనం మొత్తం తొలగించి కొన్ని గంటలపాటూ స్వామివారి నిజరూపాన్ని చూసే భాగ్యాన్ని భక్తులకు కల్పించి మళ్లీ చందనం లేపనం చేస్తారు. 


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
 
12 ఆలయాల నుంచి ఒకేసారి ఊరేగింపు


తమిళనాడు కుంభకోణంలో గరుడసేవ అక్షయ తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ రోజు సారంగపాణి ఆలయం, ఉప్పిలియప్పన్ ఆలయం సహా మొత్తం 12 వైష్ణవ ఆలయాల నుంచి ఉత్సవమూర్తులు ఒకేసారి గరుడవాహనంపై బయలుదేరుతారు. ఈ వేడుక చూసేందుకు రెండు కళ్లు సరిపోవు..
 
కన్నయ్య పాదాలు చూసే అదృష్టం ఈ ఒక్కరోజే


బృందావనంలో కొలువైన బృందావనమాలికి బంకే బిహారి అనే ఆలయం ఉంది. స్వామి హరిదాస్ నిర్మించిన ఆ క్షేత్రంలో కొలువైన గోపాలుడి పాద దర్శనం కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే లభిస్తుంది.  బృందావనంలో ఉన్న అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన ఇక్కడ.. ఏడాది మొత్తం గోపాలుడి పాదాలు కమలాలతో కప్పి ఉంటాయి. 


Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!


సంస్కృతంలో అక్షయ అంటే 'ఎప్పటికీ తగ్గదు' అని అర్థం...అందుకే ఈ రోజు దాన ధర్మాలు చేయడం, నూతన వ్యాపారాలు ప్రారంభోత్సవం, నూతన గృహ నిర్మాణం చేయడం మంచిది. రోజు మొత్తం శ్రీ మహావిష్ణువుని ధ్యానించండి.