Significance of Akshaya Tritiya 2024: హిందువులకు ప్రతి పండుగా ప్రత్యేకమే. కొన్ని పండుగలు భక్తితో ముడిపడి ఉంటే..మరికొన్ని పండుగలు సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతాయి. అయితే సెంటిమెంట్స్ తో పాటూ భారీ ఖర్చుతో ముడిపడిన పండుగల్లో ముఖ్యమైనది అక్షయతృతీయ. ఏటా వైశాఖమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు... అంటే వైశాఖమాసం ప్రారంభమైన మూడో రోజు అక్షయతృతీయ జరుపుకుంటారు. ఈ రోజున బంగారం షాపులన్నీ కళకళలాడిపోతుంటాయ్.. ఆపర్ల మీద ఆపర్లు ప్రకటిస్తారు. షాపుల దగ్గరబారులు చూస్తే అక్కడేమైనా ఉచితంగా బంగారం పంచుతున్నారా అనే సందేహం వస్తుంది. అప్పు చేసైనా కానీ ఎంతో కొంత బంగారం కొనేయాలని పోటీపడతారు. కానీ నిజంగా అక్షయ తృతీయ రోజు కొనాలా? కొనకపోతే ఏమువుతుంది? అసలు అక్షయ తృతీయ ఉద్దేశం ఏంటో తెలుసా?
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!
అక్షయం అంటే!
అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అక్షయపాత్ర అనే మాట వినే ఉంటారుగా... పాత్రలోంచి ఎంత తీసినా తరిగిపోకుండా మళ్లీ మళ్లీ నిండుతూనే ఉంటుంది. అలా అక్షయం అనే మాట వినగానే ఓ రకమైన పూనకంతో బంగారం కొనేస్తుంటారు. అంటే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సంపద, బంగారం అక్షయం అయిపోతుందని భావిస్తారు. కానీ ఈ ఆలోచనే సరికాదంటున్నారు పండితులు. ఈ రోజు పుత్తడి కొంటే అక్షయం అవదు కానీ ఈ రోజు చేసే పుణ్య కార్యాలు మాత్రం రెట్టింపు ఫలితాన్నిస్తాయి...చిన్న పాపం చేసినా అది అక్షయం అవుతుంది.
Also Read: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే!
అక్షయ తృతీయ పేరు వినగానే బంగారం, బంగారం అని పూనకాలతో ఊగిపోయే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. కలిపురుషుడు ఐదు స్థానాల్లో నివాసం ఉంటాడు. అందులో ఒకటి బంగారం. పసిడిని అహంకారానికి హేతువుగా చెబుతారు...అంటే అక్షయ తృతీయ రోజు కలిపురుషుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా అహంకారాన్ని మరింత పెంచుకున్నట్టు అర్థం. మరి అక్షయ తృతీయ అంటే బంగారమే అనే ప్రచారం ఎందుకొచ్చిందనే సందేహం రావొచ్చు...ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలని కాదు దానం చేయాలన్నది అసలు ఆంతర్యం. కానీ బంగారం దానం చేసేంత స్తోమత అందరకీ ఉండదు కదా.. ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం అక్షయం అవుతుందని చెబుతారు..అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలన్న ప్రచారం కేవలం వ్యాపారం పెంచుకునే ట్రిక్ మాత్రమే. ఆ మాయలో పడి బంగారం కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారంతే..
అక్షయ తృతీయ రోజు ఏ ఏ దానాలు చేయాలి!
వైశాఖ మాసం అంటే ఎండలు మండిపోయే సమయం. అందుకే ఈ అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేస్తారు. అన్నదానం చేస్తే మరింత ఫలితం. ఇంకా గొడుగు, చెప్పులు, దుస్తులు దానం చేయాలి. ఎక్కడిక్కకడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పానకం, మజ్జిగ, పండ్లు దానం ఇవ్వడం మంచిది. ఇలా అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అర్థకానీ...పోటీపడి బంగారం కొనుక్కుని తెచ్చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని కాదు.
Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
రోజంతా మంచి ముహూర్తమే
అక్షయ తృతీయ రోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు. ఈ రోజు దుర్ముహుర్తాలు, వర్జ్యాలు, యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు. రోజు మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభఫలితాలే వస్తాయని విశ్వసిస్తారు.
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!