akshaya tritiya 2024 shubh muhurat:  ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. 


Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
 
అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి!


కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు. అందుకే ఈ రోజు అమ్మవారిని అలంకరిస్తారు. అందుకే బంగారం కొనుగోలు చేసి అలంకరించేయాలనే సెంటిమెంట్ మొదలైంది. కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి కానీ.... బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు..దాన, ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో ఉంది. ఈ రోజు  చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు  


"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"


కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.


Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!


అక్షయ తృతీయ రోజే ఇవన్నీ...


@ నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు


@ శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు  


@ పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే 


@ వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ 


@ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజే


@ కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజే


@ కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే


@ ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..


@  బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. 


@ సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!