Akshaya Tritiya 2023: అక్షయ తృతీయనే కొన్ని ప్రాంతాల్లో తీజ్ అంటారు.ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే తదియ రోజు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22 న తదియ తిథి ప్రారంభమై ఏప్రిల్ 23 సూర్యోదయం సమయానికి ఉంటోంది. దీంతో కొందరు ఏప్రిల్ 22న అక్షయ తృతీయ జరుపుకుంటే మరికొందరు ఏప్రిల్ 23న జరుపుకుంటున్నారు. సంస్కృతంలో అక్షయ అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున మంచి పనులు ప్రారంభిస్తే అనంతమైన శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. బంగారం, ప్రాపర్టీలు, విలువైన వస్తువులు ఈరోజున చాలా మంది కొనుగోలు చేస్తారు. వీటితో పాటే అక్షయతృతీయ రోజు కొన్ని వస్తువులే కొంటే శ్రేయస్కరం అని విశ్వసిస్తారు కొందరు. ఆ వస్తువులేంటంటే..
అక్షయ తృతీయ రోజు కొనాల్సిన 10 వస్తువులు
బంగారు ఆభరణాలు
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. బంగారం ఇంట్లోకి తీసుకురావడం అంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొస్తున్నట్టే అని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం షాపులన్నీ కళకళలాడుతాయి. ఈ రోజు బంగారం కొంటే సంపద వృద్ధి చేస్తుందనుకుంటారు..అయితే బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు ఎంతోకొంత దానం చేయడం శ్రేయస్కరం అంటారు పండితులు.
వెండి వస్తువులు
బంగారంతో పాటూ వెండివస్తువులు కొనుగోలు చేయడం కూడా పవిత్రంగా భావిస్తారు. వెండి పాత్రలు, వెండి దీపపు కుందులు కొనుగోలు చేస్తే ఈ రోజు అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. కొందరు వెండివస్తువులు కొనుగోలు చేసి తమ సన్నిహితులకు బహుమతిగా ఇస్తారు.
Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!
రియల్ ఎస్టేట్
భూములు, ఆస్తులపై నూతన పెట్టుబడులకు అక్షయ తృతీయను శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు వీటిపై పెట్టుబడులు పెట్టే భవిష్యత్ లో మంచి లాభాలు వస్తాయని విశ్వాసం.
స్టాక్ మార్కెట్
స్టాక్ మర్కెట్లో పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలం అని చాలామంది నమ్మకం. ముఖ్యంగా కొత్తగా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టేవారికి ఈ రోజు సెంటిమెంట్. షేర్స్ , మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఆర్జివచ్చని భావిస్తారు.
ఎలక్ట్రికల్ వస్తువులు
ఎలక్ట్రికల్ వస్తువులు ఈ రోజు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని..చాలాకాలం పాటు నిలిచిఉంటాయని కొందరి నమ్మకం. అందుకే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వాహనాలు
ఎప్పటి నుంచో వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు అక్షయ తృతీయ రోజు కొంటే మంచిదని విశ్వసిస్తారు. ఎందుకంటే ఈ రోజు వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం ప్రభావం ఉండదని..రోజంతా అమృత ఘడియలతో సమానం అని అందుకే ఈ రోజు వాహనాలు కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందంటారు.
Also Read: అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు, ఈ ఆలయాలకు చాలా ప్రత్యేకం!
వ్యవసాయ ఉపకరణాలు
వ్యవసాయంలో ఉపయోగించే ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేసేందుకు ఇంతకన్నా శుభప్రదమైన రోజు ఉండదంటారు. ఈ రోజు కొన్న వ్యవసాయ వస్తువులను పనుల్లో ఉపయోగిస్తే మంచి దిగుబడి వస్తుందని, కష్టానికి తగిన ఫలితం వస్తుందని భావిస్తారు.
నూతన వస్త్రాలు
సాధారణంగా పండుగల రోజు కొత్త దుస్తులు కొనుక్కోవడం హిందువుల సంప్రదాయం. అక్షయ తృతీయ రోజు నూతన వస్త్రాలు కొనుగోలు మరింత మంచిదంటారు. ఈ రోజు నూతన వస్త్రాలు ధరిస్తే శుభం జరుగుతుందని భావిస్తారుయ
పుస్తకాలు
జ్ఞానాన్ని పెంచే పుస్తకాల కొనుగోలుకి ఎప్పుడైనా మంచిదే..కానీ..అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తే చదువుపై ధ్యాస పెరుగుతుందని చాలామంది విశ్వాసం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ రోజు పుస్తకాలు కొని చదివితే విజయం సాధిస్తామని నమ్ముతారు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఎదుగుతామని భావిస్తారు.
దాన ధర్మాలు
అక్షయ తృతీయ రోజు అన్నిటి కన్నా ముఖ్యమైనవి దాన ధర్మాలు.ఎండలు పెరిగే సమయం కావడంతో అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయడం మంచిది. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు. చెప్పులు-గొడుగు-వస్త్రాలు- విసనికర్రలు దానం చేయడం. ఇంకా మజ్జిగ, పానకం, పండ్లు దానం చేయడం ద్వారా మీ పుణ్యం అక్షయం అవుతుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.