Dolo 650 Dilip Surana New Home: మీకు దిలీప్ సురానా తెలుసా?, ఎక్కువ మంది ఈ పేరు విని ఉండకపోవచ్చు. కొంతమందికి మాత్రం ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది అనిపిస్తుంది. బిజినెస్‌ వార్తలు తరచూ ఫాలో అవుతూ, జ్ఞాపకశక్తి బాగా ఉన్న వ్యక్తులు ఈ పేరును ఠక్కును గుర్తు పడతారు.


ఆస్తి కొనుగోలులో కొత్త రికార్డ్‌
ఫార్మాస్యూటికల్ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ‍‌(Micro Labs Chairman & MD Dilip Surana) దిలీప్ సురానా. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, డోలో-650 టాబ్లెట్లను తయారు చేస్తున్న కంపెనీ ఓనర్‌ ఈయన. కరోనా నేపథ్యంలో డోలో-650 రికార్డ్‌ స్థాయి విక్రయాలతో తరచూ వార్తల్లో నిలిచిన దిలీప్‌ సురానా, ఇప్పుడు మరోమారు హెడ్‌లైన్‌గా మారారు. ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసి, అత్యంత ఖరీదైన ప్రాపర్టీ డీల్‌ రికార్డ్‌ సృష్టించారు. భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఆయన నివాస ఆస్తిని కొనుగోలు చేశారు. మైక్రో ల్యాబ్స్ MD కొన్న ఈ ఆస్తిలో ఒక విలాసవంతమైన బంగ్లాతో పాటు కొంత ఖాళీ స్థలం కూడా ఉంది.


సేల్ డీడ్ పత్రాల ప్రకారం, దిలీప్ సురానా 66 కోట్ల రూపాయలకు ఆస్తి కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు, ఈ కేటగిరీలో అతి పెద్ద డీల్‌గా ఇది నిలిచింది. బంగ్లాతో కూడిన ఈ ఆస్తి, బెంగళూరులోని ఫెయిర్ ఫీల్డ్ లే-ఔట్ ప్రాంతంలో ఉంది. గతంలో దీనిని రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవాళ్లు. ఈ డీల్‌లో 12,043.22 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఖాళీ స్థలం (ప్లాట్‌), 8,373.99 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న బంగ్లా ఉన్నాయి.


స్టాంప్‌ డ్యూటీ కోసమే ₹3.36 కోట్లు వ్యయం
దిలీప్ సురానా, తన కొత్త ఆస్తిని జీజీ రాజేంద్ర కుమార్, అతని భార్య సాధన రాజేంద్ర కుమార్, మను గౌతమ్ నుంచి కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఆస్తి కోసం సురానా 3.36 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. సురానాకు ఇప్పటికే ఫెయిర్ ఫీల్డ్ లే-ఔట్ ప్రాంతంలో కొంత నివాస స్థలం ఉంది.


కేంద్ర బడ్జెట్ తర్వాత పెరిగిన పెద్ద ఇళ్ల అమ్మకాలు
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన, పార్లమెంటులో కొత్త కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, బడ్జెట్‌లో భాగంగా చేసిన ప్రకటన విలాసవంతమైన గృహాల విక్రయాలను వేగవంతం చేసింది. నివాస ఆస్తుల్లో (రెసిడెన్షియల్ ప్రాపర్టీ‌స్‌) పెట్టుబడిపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌ మినహాయింపును రూ. 10 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిబంధన 2023 ఏప్రిల్ 01 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల, కొత్త నిబంధన అమల్లోకి రాకముందు, ఫిబ్రవరి & మార్చి నెలల్లో విలాసవంతమైన ఇళ్ల విక్రయాలు పెరిగాయి.


కరోనా కాలంలో విపరీతమైన సంపాదన
ఫార్మాస్యూటికల్ కంపెనీ మైక్రో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయం బెంగళూరులోనే ఉంది. ఈ కంపెనీ ఔషధ ఫార్ములాలు, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్‌ (APIs) తయారు చేస్తుంది. దీంతో పాటు, కొన్ని ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ఈ కంపెనీ విపరీతంగా పాపులర్‌ అయింది. పారాసెటమాల్ బ్రాండ్‌ డోలో-650, మహమ్మారి సమయంలో బాగా అమ్ముడైంది. ఈ కంపెనీని దిలీప్ సురానా తండ్రి జీసీ సురానా 1973లో చెన్నైలో స్థాపించారు.